‘అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’
న్యూఢిల్లీ : తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వెనక్కి తగ్గారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు.
తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆర్మీ చీఫ్‌ను సందీప్ దీక్షిత్ కించపరిచేలా మాట్లాడటం దారుణమన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆర్మీ ప్రతిష్టను కాంగ్రెస్ దిగజారుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ సైనికులు, తమ కుటుంబాలతో కలిసి రాజ్‌ఘాట్ వద్ద ఆందోళనకు దిగారు.