Sadak Ka Gunda
-
సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్
బెంగళూరు : ఆర్మీ చీఫ్‌పై సందీప్ దీక్షిత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆర్మీతో రాజకీయాలు చేయడం సరికాదని, దేశం కోసం సైనికులు పని చేస్తున్నారన్నారు. ఆర్మీ చీఫ్, సైనికుల జోలికి వెళ్లడం మంచిది కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలను సందీప్ దీక్షిత్ ఉపసంహరించుకున్నారు. కాగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తక్షణమే సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సోనియా, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
‘అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’
న్యూఢిల్లీ : తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ వెనక్కి తగ్గారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆర్మీ చీఫ్‌ను సందీప్ దీక్షిత్ కించపరిచేలా మాట్లాడటం దారుణమన్నారు. ఒక పద్ధతి ప్రకారం ఆర్మీ ప్రతిష్టను కాంగ్రెస్ దిగజారుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. ఆయనను తక్షణమే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ సైనికులు, తమ కుటుంబాలతో కలిసి రాజ్‌ఘాట్ వద్ద ఆందోళనకు దిగారు. -
ఆర్మీ చీఫ్‌పై వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మాఫియాలాగా హెచ్చరికలు చేసే పాక్ సైన్యానికి మన ఆర్మీకి తేడా ఉంది. మన ఆర్మీ చీఫ్(రావత్) వీధి రౌడీలా మాట్లాడుతుంటే వినడానికి ఇబ్బందిగా ఉంది. ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి’ అని అన్నారు. ఆర్మీ చీఫ్‌ను వీధి రౌడీ అనడానికి కాంగ్రెస్ పార్టీకి ఎంత ధైర్యమని హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు మండిపడ్డారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ క్షమాపణ చెప్పడంతో పాటు సందీప్‌ను పార్టీ నుంచి తొలగించాలని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా డిమాండ్ చేశారు. మరోవైపు సందీప్ వ్యాఖ్యలు దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సందీప్ క్షమాపణలు చెప్పారు.