నల్గొండ : కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న కారు కల్వర్టును ఢీకొట్టి బ్రిడ్జిపై నుంచి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్లు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు భద్రచలం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.