సాక్షి, ముంబై: జల్‌గావ్ జిల్లా భడ్‌గావ్ సమీపంలోని కాలువలోకి కారు దూసుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు నీటిలో మునిగి మరణించారు. అందిన వివరాల మేరకు పారోలా-భడ్‌గావ్ రోడ్డుపై నాలబందీఫాటా సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోరోలా నుంచి నిఖిల్ పాటిల్ (31), శివాజీ పాటిల్ (29), భూషణ్‌కుమర్ అలియాస్ అమోల్ పాటిల్ (34) అనే ముగ్గురు భడ్‌గావ్‌కు ఇండికా కారులో సోమవారం రాత్రి బయలుదేరారు. నాలబందీఫాటా సమీపంలో జామదా ఎడమ కాలువ వద్ద ఉన్న మలుపు కన్పించక కాలువలో ఇండికా కారు అందులోకి దూసుకుపోయింది.
అర్థరాత్రి కావడంతో ఈ ఘటన గురించి ఎవరికీ తెలియరాలేదు. అయితే రాత్రి ఒంటి గంట అయినప్పటికీ వారు ఇంటికి చేరుకోకపోవడంతో నిఖిల్, శివాజీ, అమోల్ తల్లిదండ్రులు వారి కోసం వెదుకులాట ప్రారంభించారు. అలాగే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. కాగా, తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో కాలువలో కారు పడిపోయిన సంగతి బయటపడింది. దాంతో స్థానికుల మద్దతుతో కాలువ నుంచి ఇండికా కారును బయటికి తీశారు. ఆ కారులో ముగ్గురి మృతదేహాలు లభించాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేకెత్తించింది.
కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురి దుర్మరణం
Published Tue, Dec 9 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM
Advertisement
Advertisement