సాక్షి, కృష్ణా: చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గాజుల రత్నభాస్కర్ (47) మృతదేహంగా దొరికిన సంగతి విదితమే. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారడంతో.. చేధించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ముదినేపల్లికి కారులో వెళ్లాల్సిన భాస్కర్ చోడవరం వైపు వెళ్లడం.. చివరకు శవమై కనిపించడం, పైగా వెంట తీసుకెళ్లిన డబ్బులూ కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అవనిగడ్డ ప్రమాదం కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కెనాల్‌లో కారు దూసుకెళ్లిన 36 గంటల తర్వాత(మంగళవారం ఉదయం).. తోట్లవల్లూరు మండలం కళ్లంవారిపాలెం వద్ద నగ్నంగా రత్నభాస్కర్ మృతదేహం తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వచ్చి మృతదేహాన్ని చూసి రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఒంటిపై గాయాలు - ఎలాంటి క్లూ లేకపోవడంతో ఏం జరిగిందన్నది నిర్ధారించుకోలేకపోయారు పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు.
అర్థరాత్రి ఏం జరిగింది..
రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనేదే మిస్టరీగా మారింది. ఇంటి నుంచి ఆయన రూ.4 లక్షలతో బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. ఆర్థిక లావాదేవీలు, శత్రువులున్నారా? లేదంటే దొంగల పనా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అలాగే.. రత్నభాస్కర్ కారు జర్నీ ఆధారంగా సీసీఫుటేజ్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఒంటరిగానే వెళ్తున్నట్లు కనిపించినట్లు తెలుస్తోంది.
పోస్టుమార్టం కీలకం..
రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం దొరికినా కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. నివేదిక వస్తేనే.. ఏం జరిగిందనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
జరిగింది ఇదే..
ముదినేపల్లికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని గాజుల రత్నభాస్కర్ ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముదినేపల్లి ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సోమవారం వేకువజామున చోడవరం వద్ద తాను ప్రయాణిస్తున్న కారుతో సహా కేఈబీ కెనాల్‌లోకి దూసుకువెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న రత్నభాస్కర్ ముదినేపల్లికి వెళ్లకుండా చోడవరం వచ్చి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడాలని కారులోనే దుస్తులు విప్పి కాలువలోకి రత్నప్రసాద్ దిగి మృతి చెందాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న దుస్తులు, సెల్‌ఫోన్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తామని డీఎస్పీ జయసూర్య తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment