- పక్క కట్టడంపై కూలిన భవనం
- తండ్రీకొడుకు దుర్మరణం
- మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- విద్యుదాఘాతానికి గురై మరొకరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోకురిసిన భారీ వర్షానికి ముగ్గురు బలయ్యారు. ఇటీవల ఎప్పుడూ లేనంతగా కుంభవృష్టి కురవడంతో హలసూరులోని జోగుపాళ్యలో బుధవారం రాత్రి 1.30 గంటల సమయంలో ఓ భవనం కూలి పక్క కట్టడంపై పడిపోయిన దుర్ఘటనలో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సుబ్రమణి (37), అతని కుమారుడు కిరణ్ సాయి (10) మరణించారు. వారు నివసిస్తున్న ఇంటి పక్కనే మూడంతస్తుల భవనం ఉంది. వర్షం పడుతుండడంతో బయట ఉన్న బైక్‌ను లోనికి తీసుకు రావడానికి సుబ్రమణి, కిరణ్‌లు వెళ్లారు.
భారీగా వర్షం పడుతున్నందున బయటకు వెళ్లడం వద్దంటూ కిరణ్ వారిస్తున్నప్పటికీ సుబ్రమణి లాక్కెళ్లాడు. అదే సమయంలో రెండు అంతస్తులు కూలి పడడంతో ఇద్దరూ మరణించారు. రాత్రి 1.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న బీబీఎంపీ సిబ్బంది కార్యాచరణ చేపట్టి, ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరో సంఘటనలో బసవేశ్వర నగర పదో మెయిన్‌లోని సాయి మందిరంలో విశేష పూజలను పురస్కరించుకుని గురువారం వేకువ జామున ప్రసాదాలు చేయడానికి వెళ్లిన శంకర్ అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆలయ ప్రాంగణం జలావృత్తమైంది. వంట చేసే స్థలం వద్ద నీటిని తోడుతూ అతను మృత్యువాత పడ్డాడు.