- వార్ వన్ సైడే..
- గంట గంటకూ ఓటింగ్ శాతంపై వాకబు
- ‘విభజన’ నేపథ్యంలో కాంగ్రెస్ దుస్థితిపై ఆరా
- ‘ఫ్యాన్’ హవా వల్లే ఓటింగ్ పెరిగిందని అంచనా
- టీడీపీ నేతలు అధిక శాతం ఇటు వైపే మొగ్గు!
- వైఎస్‌ఆర్ సీపీ నాయకుల్లో ఉత్సాహం
- పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందంటున్న జగన్ అభిమానులు
- తాడిపత్రి, హిందూపురంపై ప్రత్యేక ఆసక్తి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : సీమాంధ్రలో బుధవారం నాటి పోలింగ్‌పై నగరంలో ప్రవాసాంధ్రులు, నివాసాంధ్రులు, కన్నడిగులు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. గంట గంటకు ఓటింగ్ శాతం గురించి వాకబు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి ఎంత శాతం నమోదవుతుందనే అంశంపై ముందుగానే ఓ అంచనాకొచ్చారు. కాస్త అటు ఇటుగా సుమారు 80 శాతానికి చేరుకుంటుందని మధ్యాహ్నానికే నిర్ణయానికొచ్చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజించడంపై సీమాంధ్రులతో పాటు ఇక్కడి ప్రవాసాంధ్రుల నుంచీ ఆగ్రహం వ్యక్తమవుతోంది. కన్నడిగులూ ఆంధ్రప్రదేశ్‌ను విభజించకూడదనే వాదిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలను ఇక్కడి వారు ఆది నుంచీ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఓటు వేయడానికి చాలా మంది ప్రవాసాంధ్రులు ఇప్పటికే సొంత ఊర్లకు వెళ్లిపోగా, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇతరత్రా వ్యాపకాల వల్ల వెళ్ల లేని వారు తరచూ తమ వారికి ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు.
ఫలానా గ్రామం వారు ఏ వైపు ఓటు వేశారు, ఫలానా బూత్‌లో ఓటింగ్ సరళి ఎలాగుందంటూ గంట గంటకు సమాచారాన్ని సేకరించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, హిందూపురం శాసనసభ పోలింగ్‌పై ప్రత్యేక ఆసక్తి చూపారు. ఈ స్థానాల్లో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి, సినీ నటుడు బాలకృష్ణ బరిలో ఉన్నారు. కాగా, ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఏ పార్టీకి అనుకూలిస్తుందనే విషయమై కూడా ఆసక్తికరమైన చర్చ సాగింది.
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరడంతో, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా సాగుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. జగన్, షర్మిల, విజయమ్మల సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చిన సందర్భాల్లో, వీరంతా ఓటింగ్ రోజు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తే, పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది.
సంప్రదాయక తెలుగుదేశం ఓటర్లలో ఎక్కువ మంది ఈసారి వైఎస్‌ఆర్ సీపీ వైపు మొగ్గారని వారికి సమాచారం అందింది. దీనికి కారణాలను కూడా పలువురు ఆరా తీశారు. పక్కా ఇళ్లు, వృద్ధాప్య పింఛన్లు ప్రధాన కారణాలు కాగా, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు కూడా ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయని పల్లెల నుంచి ఇక్కడి వారికి వర్తమానం అందింది. వెరసి ఈసారి ఫలితాలు తమ రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా ఉంటాయని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ఉత్సాహంతో ఉన్నారు.