సంఘటనా స్థలంలో గుమికూడిన గ్రామస్తులు
చెన్నై, సేలం: గ్రామంలోకి చొరబడిన ఒక పులి మేకను అడవిలోకి ఊడ్చుకెళ్లిన సంఘటన గురువారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. ఈరోడ్ జిల్లా భవాని సాగర్ సమీపంలో పసువంపాళయం గ్రామానికి చెందిన సుబ్రమణి (50) కార్మికుడు. ఇతను అయిదు మేకలను పెంచుతున్నాడు. వీటిని రోజూ మేత కోసం సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకు వచ్చి కట్టేస్తాడు. ఎప్పటిలానే బుధవారం ఇంటికి వచ్చి మేకలను కట్టేసి నిద్రించాడు.
గురువారం వేకువజామున అకస్మాత్తుగా మేకలు పెద్దగా అరుస్తున్నట్టు వినిపించింది. సుబ్రమణితో పాటు ఇరుగుపొరుగు వారు కూడా మేల్కొన్నారు. వారంతా అక్కడికి వచ్చి చూడగా మేకలను ఒక పులి తింటూ కనిపించింది. జనం అరవడంతో పులి ఒక మేక మెడను నోటికి కరుచుకుని అడవిలోకి పరారైంది. అక్కడ మరో మేక చనిపోగా, ఇతర మేకలు గాయాలయ్యాయి. ఈ సంఘటన చుట్టు ప్రాంతాలకు దావానంలా వ్యాపించింది. ఆ గ్రామాలకు చెందిన వారు గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. దీనిపై గ్రామస్తులు భవానిసాగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment