
సాక్షి, చెన్నై: ఎన్నికల తనిఖీలు విస్తృతంగా సాగుతున్నాయి. సేలం సమీపంలో ఓ కంటైనర్లో రూ.36 కోట్ల విలువగల బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల్లో నగదు బట్వాడా అడ్డుకట్ట లక్ష్యంగా విస్తృత తనిఖీలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం అర్ధరాత్రి సేలం వైపుగా వచ్చిన ఓ మినీ కంటైనర్‌ను అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.36.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సరైన రసీదులు లేని దృష్ట్యా, ఆ మినీ కంటైనర్‌ను భద్రత నడుమ గంగవళ్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉంచారు. గిండి నుంచి సేలంలోని నగల షోరూమ్‌కు ఆభరణాలు తరలిస్తున్నట్టు విచారణలో తేలింది.
ఎవరి సొమ్మో..
తంజావూరులోని నగరాభివృద్ధి శాఖకు చెందిన ఓ అధికారి లాకర్‌లో రూ.3.39 కోట్ల నగదు, రూ. 174 సవర్ల నగలు ఉన్నట్టు ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి ఏసీబీ వర్గాలు ఆ లాకర్‌ను తెరిచి చూడగా, నగదు, నగలు బయటపడ్డాయి. చెన్నై తిరుప్పోరూర్– కేలంబాక్కం మార్గంలో ఓ వాహనంలో రూ. 24 లక్షలు అధికారులు పట్టుకున్నారు. అది ఏటీఎంకు తరలిస్తున్న నగదుగా వివరణ ఇచ్చుకున్నా ఫలితం శూన్యం. కోవిల్ పట్టిలో మంత్రి కడంబూరురాజు వాహనాన్ని సైతం ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది.
స్వతంత్ర అభ్యర్థులా మజాకా..
చెన్నై తిరువొత్తియూరు నుంచి హైకోర్టు న్యాయవాది జాకీర్‌హుస్సేన్ (47) స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నగల డిపాజిట్‌కు సంబంధించి ధర్నా చేసి ఎన్నికల అధికారి దేవేంద్రన్‌కు ఆయన ముచ్చెమటలు పట్టించారు. విల్లివాక్కంలో స్వతంత్ర అభ్యర్థి కంద స్వామి రూ. పది వేల నగదుకుగాను 18 కేజీల చిల్లరను అధికారులకు సమర్పించి ముచ్చెమటలు పట్టించడం గమనార్హం.