అంతా మాయ | Tirupati Science Congress arrangements As the most crumbling | Sakshi
Sakshi News home page

అంతా మాయ

Published Mon, Jan 2 2017 1:57 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

అంతా మాయ

అంతా మాయ

స్కెచ్‌ ‘ముఖ్య’నేతది... అమలు చిన్నబాబుది
అత్యంత నాసిరకంగా తిరుపతి సైన్స్‌ కాంగ్రెస్‌ ఏర్పాట్లు


సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో కరకంబాడి, ఎయిర్‌పోర్టు రోడ్లను మూడు నెలల క్రితమే ‘తుడా’ నిధులతో అందంగా తీర్చిదిద్దారు. అయితే, ఇప్పుడు సైన్స్‌ కాంగ్రెస్‌ నేపథ్యంలో మళ్లీ అవే రోడ్లకు మరమ్మతులకు రూ.4 కోట్లు కేటాయించారు. తిరుపతి ఎయిర్‌ఫోర్టు జంక్షన్‌ నుంచి కేఎల్‌ఎం ఆస్పత్రి వరకూ ఉన్న 71వ జాతీయ రహదారికి గతంలోనే సుందరీకరణ  చేపట్టారు. బాగున్న తారు రోడ్డుపై ఇటీవల రాత్రికి రాత్రే  మరికాస్త తారు పోసి మమ అనిపించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌  పనుల్లో జరుగుతున్న అవకతవకలకు ఈ ఉదంతాలే నిదర్శనం.

సర్కారు సొమ్ముకు ఎసరు   
ప్రభుత్వ నిధులతో చేపట్టే ఏ పనుల్లోనైనా కమీషన్లు నొక్కేయడంలో ‘ముఖ్య’నేత, ఆయన కుమారుడు ఆరితేరిపోయారు.గడువు ముంచు కొచ్చే వరకూ టెండర్లు పిలవకుండా ఉద్దేశపూర్వకం గా జాప్యం చేయడం... తర్వాత  సమయం లేదం టూ కమీషన్లు ఇచ్చేవారికే నామినేషన్‌ విధానంలో పనులు అప్పగించేయడం.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీస్థాయిలో నిధులు కేటాయించడం.. నాసిరకంగా పనులు పూర్తిచేసి ఆ నిధులు భోంచేయడం.. ఇదీ ‘ముఖ్య’నేత వేసే స్కెచ్‌. దాన్ని పక్కాగా అమలు చేసి, కమీషన్లు జేబులో నింపుకోవడమే చినబాబు చేసే పని. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా సాగుతున్న దందా ఇదే. చిత్తూరు జిల్లా తిరుపతిలో జరగనున్న సైన్స్‌ కాంగ్రెస్‌ పనుల్లోనూ రూ.175 కోట్ల నిధుల గోల్‌మాల్‌కు రంగం సిద్ధం చేశారు. గతంలో ఏ సైన్స్‌ కాంగ్రెస్‌కూ కేటాయించని విధంగా ఈసారి భారీగా నిధులిచ్చారంటే ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారని అనుకుంటే పొరపాటే. ఎప్పటిలాగే నాసిరకం పనులతో ప్రభుత్వ సొమ్మును మింగేసే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిపోతూనే ఉంది.  

104వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ (ఇస్కా)ను తిరుపతి ఎస్వీయూలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 3న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభిస్తారు. దేశ విదేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరు కానున్నారు. సదస్సు నిర్వహణ కు రాష్ట్ర ప్రభుత్వం రూ.175 కోట్లు కేటాయించింది. వీటిలో దాదాపు రూ.80 కోట్ల పనులు పూర్తయ్యాయి. మరో నాలుగు రోజుల్లో రూ.20 కోట్ల విలువైన వి జరుగుతాయని అంచనా. ‘ముఖ్య’నేత, ఆయన కుమారుడి అండదండలున్న కాంట్రాక్టర్లే ఈ పనులను దక్కించుకున్నారు.

పేరుకే టెండర్లు.. ముందే ఒప్పందాలు
‘ఇస్కా’ ఏర్పాట్లకు సంబంధించిన పనులతోపాటు రోడ్లు, సెమినార్‌ హాళ్లు, ఆడిటోరియంలు, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మరమ్మతు వంటి మేజర్‌ పనులను అధికార పార్టీ నాయకులే దక్కించుకున్నారు. ‘ముఖ్య’నేత పేరు చెప్పి టెండర్లలో పాల్గొన్నారు. పేరుకు టెండర్లయినా ఏయే పనులు ఎవరెవరు చేయాలో ముందే నిర్ణయించారు. ఈ విషయంలో ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పూర్తిగా సహకరించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లతోపాటు నేషనల్‌ హైవేకు చెందిన ఏడు రోడ్ల పనులను (సుమారు రూ.35 కోట్లు) తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. దగ్గరుండి మరీ అధిక ధరలకు(ఎక్సెస్‌) టెండర్లు దాఖలు చేయించి పనులు కట్టబెట్టారు. టెండర్లలో పాల్గొన్న శుభగిరి, వీవీఆర్, టీజేఎన్, హేమంత్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలు రోడ్ల పనులు చేపట్టాయి.

ఇంత ఖర్చు ఇదే మొదటిసారి!
విశాఖపట్నంలో 2008లో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ జరిగినప్పుడు నిర్వహణ వ్యయం దాదాపు రూ.20 కోట్లే. గతేడాది మైసూరులో సైన్స్‌ కాంగ్రెస్‌ వ్యయం రూ.60 కోట్లని సమాచారం. అయితే ఈ ఏడాది తిరుపతి సైన్స్‌ కాంగ్రెస్‌కు ప్రభుత్వం ఏకంగా రూ.175 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇస్కా సదస్సులకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి.



వాహనాల టెండర్లలోనూ అదే తీరు
 వాహనాల అద్దెలకే రూ.2 కోట్లు వెచ్చించాలని అంచనాలు రూపొందించారు. తిరుపతికి చెందిన స్వర్ణాంధ్ర ట్రావెల్స్, చెన్నైకి చెందిన మరో ట్రావెల్స్‌కు టెండర్లు అప్పగించారు. జనవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ అతిథులకు 2,534 వాహనాలు అవసరమని అంచనా వేశారు. ఇందులో 980 ఇన్నోవాలు, 1,200 స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లు, 206 టెంపో ట్రావెలర్స్‌తోపాటు ఆర్టీసీ బస్సులు, ఏసీ కోచ్‌లు అవసరమని ప్రతిపాదించారు. ఒక్కో వాహనం రోజుకు 250 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. ఇన్నోవాకు రోజుకు రూ.3,600, స్విఫ్ట్‌ డిజైర్‌కు రూ.2,500, టెంపో ట్రావెలర్‌కు రూ.4,600 చొప్పున చెల్లించాలి. ఏసీ బస్సుకు రోజుకు రూ.10 వేలు చెల్లించాలని ప్రతిపాదించారు. వాస్తవానికి ఒక్కో వాహనం రోజుకు 250 కిలోమీటర్లు తిరిగే ప్రసక్తే లేదు. ఎంత ఎక్కువ తిరిగినా 100 కిలోమీటర్లకు మించదు. ఇవి మాత్రమే కాకుండా భోజనాలు, షామియానాలు, వేదికల నిర్మాణం, సుందరీకరణ, విమానాల చార్జీలు, హోటళ్ల అద్దెలకు నిధుల కేటాయింపు గురించి నివేదికల్లో కనిపించడం లేదు.

టూర్‌ ప్యాకేజీలకు రూ.2 కోట్లట...
తిరుపతి చుట్టుపక్కలుండే అప్పలాయకుంట, తిరుచానూరు, శ్రీనివాసమంగాపురం వంటి ఆలయాలను అతిథులకు చూపెట్టేందుకు టూర్‌ ప్యాకేజీలు నిర్ణయించిన రాష్ట్ర పర్యాటక శాఖకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. ఏసీ బస్సుల్లో నాలుగు రోజులు వరుసగా తిప్పినా రూ.10 లక్షలు కావు, మరి రూ.2 కోట్లు ఎలా ఖర్చు చూపిస్తారన్నది ప్రశ్న. తమకెంతో సన్నిహితంగా ఉండే విజ్‌క్రాఫ్ట్‌ సంస్థకు ఈ కాంట్రాక్టును ప్రభుత్వం అప్పగించింది.

ఏఏ పనులకు ఎంతెంత..?
ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సుల సందర్భంగా తిరుపతి ఎస్వీయూ క్యాంపస్, బయట చేపడుతున్న వివిధ రకాల పనులకు ప్రభుత్వం కేటాయించిన నిధుల వి«వరాలు ఈ విధంగా ఉన్నాయి.
1 పురుషుల హాస్టళ్ల రిపేర్లకు    – రూ.10.59 కోట్లు
2 మహిళల హాస్టళ్ల రిపేర్లకు     – రూ.5.70 కోట్లు
3 టూరిజం, కల్చరల్‌ విభాగాల వ్యయం    – రూ.2.00 కోట్లు
4 మంచినీళ్లు, వాటర్‌లైన్లు, ఆర్‌వో ప్లాంట్లు    – రూ.1.46 కోట్లు
5 సెమినార్‌ హాళ్లు, ఆడిటోరియంల రిపేర్లకు    – రూ.11.20 కోట్లు
6 ఆర్‌ అండ్‌ బీ రోడ్ల విస్తరణ, రిపేర్లు    – రూ.10.96 కోట్లు
7 జాతీయ రహదారుల పనులకు     – రూ.25.27 కోట్లు
8 విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లకు    – రూ.1.00 కోట్లు

పనులన్నింటిలోనూ మాయాజాలం...
ఆర్‌ అండ్‌బీ రోడ్ల విషయంలో ఆసక్తికరమైన విషయం ఏమంటే... దాఖలైన ఈ ప్రొక్యూర్‌మెంట్‌ బిడ్లను తెరవకముందే ఓ కాంట్రాక్టరు ఎస్వీయూ క్యాంపస్‌లో రోడ్ల పనులను మొదలు పెట్టారు. దీంతో టెండర్ల కేటాయింపుల్లో గోల్‌మాల్‌ జరిగినట్లు తేటతెల్లమైంది.
కరకంబాడి, ఎయిర్‌పోర్టు రోడ్లను మూడు నెలల కిందటే తుడా నిధులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ రెండు రోడ్లూ అందంగా, వెడల్పుగా బాగున్నా యి. అయితే మళ్లీ ఇదే రోడ్లకు రిపేర్లంటూ రూ.4 కోట్లు కేటాయించారు.
ఎయిర్‌ఫోర్టు జంక్షన్‌ నుంచి కేఎల్‌ఎం ఆస్పత్రి వరకూ ఉన్న 71వ జాతీయ రహదారికి సుందరీకరణపనులు చేపట్టారు. రాత్రికి రాత్రే బాగున్న తారు రోడ్డుపై మరికాస్త తారు పోసి అయ్యిందనిపించారు. కచ్చితంగా ఈ పనుల్లో పెద్ద మొత్తంలో వెనుకేసుకునే వీలుంది.
వర్సిటీ రోడ్ల పనులు చేపట్టిన శుభగిరి నిర్మాణ సంస్థ కూడా కూడా హడావుడిగానే పనులు కానిచ్చేశారు. వాస్తవంగా క్యాంపస్‌లోని 36 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్లకు పూర్తిస్థాయిలో రిపేర్లు చేయాలి. కాగా ఉద్యోగులు నివాసముండే ఏరియాలో రోడ్లకు ప్యాచ్‌ వర్కులు మాత్రమే జరిగాయి.
ఎస్వీయూ క్యాంపస్‌లో ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. ఉదయం సిమెంట్‌ పనులు చేసి మధ్యాహ్నం టైల్స్‌ అతికించారు. క్యూరింగ్‌ లేని కారణంగా చాలా చోట్ల అడుగు పడితే పగిలిపోయేట్లున్నాయి.
క్యాంపస్‌లో విద్యుత్‌ పనులు కూడా నాసిరకంగా జరిగాయి. భూగర్భంలో వేసిన విద్యుత్‌ కేబుల్స్, బల్బులు స్టాండర్డ్‌ లేని కంపెనీలవి వాడారని ఆరోపణలున్నాయి. కనీసం తయారీ సంస్థకు సంబంధించిన లేబుల్స్‌ లేని చైనా కంపెనీకి చెందిన ఎల్‌ఈడీ బల్బులను తెచ్చి బిగించారన్న ఆరోపణలు ఉన్నాయి.
క్యాంపస్‌లో జరిగే ఇస్కా సదస్సులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లలో భాగంగా ఎనిమిది ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బోర్లు కోసం రూ.12 లక్షలు, వాటర్‌ లైన్ల కోసం రూ.30 లక్షలు, కొత్త మోటార్ల కొనుగోలు కోసం రూ.30 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రతినిధుల వాటర్‌ బాటిళ్ల సరఫరా కోసమం టూ మరో రూ.34 లక్షలు కేటాయించారు.
ఇదే అదునుగా వీసీ బంగ్లా ఆవరణలోనూ, ప్రకాశ్‌నగర్‌లోనూ రెండు బోర్లు వేసి మోటార్లు బిగించారు.
అంచనాల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకులుగా సింటెక్సు ట్యాంకులు వాడతామని చెప్పి ఆక్వాటెక్‌ కంపెనీకి చెందిన ట్యాంకులు ఏర్పాటు చేశారు.
శ్రీనివాసా ఆడిటోరియాన్ని రూ.1.22 కోట్లతో ఆధునికీకరించారు. ఆర్‌ అండ్‌ బీలోని ఓ అధికారి బినామీ కాంట్రాక్టర్‌ పేరుమీద తానే పనులన్నీ చేయించారు. అయితే ఆడిటోరియం లోపల గోడలకు బిగించిన ఫ్యాన్లు ఊడిపోయే స్థితిలో ఉన్నాయి. ఉడ్‌ వర్క్‌ కూడా బాగా లేదు.
హాస్టళ్లు, సెమినార్‌ హాళ్ల భవనాలకు లోపల, బయట వేసిన పెయింట్లు నాసిరకంగా ఉన్నాయి. వాడిన సున్నం కూడా బ్రాండెడ్‌ కంపెనీది కాదు. దీనికితోడు రెండో పూత లేకుండా పెయింటింగ్‌ పనులు మమ అనిపించారు.
రోడ్ల పక్కన బ్యూటిఫికేషన్‌ పేరిట మంచి మొక్కలన్నింటినీ పీకి తక్కువ రకం పూలకాగితాల మొక్కలను విరివిగా పాతారు. దీనికితోడు క్యాంపస్‌లో భారీగా పెరిగిన వృక్షాలను నరికి వేశారు. దీంతో 50 ఏళ్ల నాటి
పచ్చదనం తగ్గిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement