కృష్ణా నదిపై ఆరు లేన్ల వంతెన
ఇప్పటికే దీని నిర్మాణానికి ఆసక్తి గల సంస్థలతో ఒక సమావేశం కూడా నిర్వహించింది. ఎన్‌సీసీ, హెచ్‌సీసీ, ఆఫ్కాన్స్, గామన్ ఇండియా, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ వంతెనకు సంబంధించి ఇప్పటికే ఎల్ అండ్ టీ ఆరు కాన్సెప్ట్ డిజైన్లను ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు ఆ సంస్థకే వంతెన నిర్మాణ బాధ్యతలను అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వంతెన కేవలం రాకపోకలకు మాత్రమే ఉపయోగపడేలా కాకుండా వినోద కేంద్రంగా కూడా ఉండేలా చూడాలని భావిస్తున్నారు. అందుకే రెండు అంతస్తుల్లో కింది నుంచి ట్రాఫిక్ వెళ్లేలా పైన పర్యాటకులు తిరిగేలా దీన్ని తీర్చిదిద్దను న్నారు. ఈ ప్రాంతంలో నది బాగా వెడల్పు గా ఉండి, చుట్టూ కొండలతో ఆకర్షణీయంగా ఉండటంతో ప్రజలు ఈ ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయాలనేది ప్రభుత్వ యోచనగా ఉంది.
ప్రస్తుతం రాజధానికి ముఖద్వారం లేదు. గుంటూరు వైపు నుంచి ఐదో నంబరు జాతీయ రహదారి వైపు నుంచి అమరావతి వరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మిస్తున్నా అది హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారికి చాలా దూరం అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వచ్చి, కనకదుర్గ వారధి మీదుగా రాజధానికి వెళ్లాల్సి వస్తోంది. వంతెన నిర్మాణం పూర్తి చేసుకుంటే హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారు సులువుగా, తక్కువ సమయంలో రాజధానిని చేరుకునేందుకు వీలు కలుగుతుంది. ఈ కారణంగానే వంతెన ప్రవేశ, ముగింపు ద్వారాలను భారీ వ్యయంతో ఆకర్షణీయంగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.