35 శాతం ఎక్సెస్‌కు టెండర్లు
తాత్కాలిక సచివాలయానికి పలు సంస్థల దాఖలు
అయోమయంలో సీఆర్‌డీఏ అధికారులు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని నగరంలోని వెలగపూడిలో తలపెట్టిన తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు సీఆర్‌డీఏ నిర్దేశించిన దానికంటే ఎక్కువ మొత్తానికి(ఎక్సెస్) టెండర్‌లను దాఖలు చేశాయి. దీంతో ఈ నెల 12న తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం డోలాయమానంలో పడింది. ఆరు భవనాల నిర్మాణాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి సీఆర్‌డీఏ టెండర్లు పిలవగా.. ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ సంస్థలు మాత్రమే టెండర్‌లు దాఖలు చేశాయి.
టెండర్‌లో సీఆర్‌డీఏ చదరపు అడుగుకు రూ.3 వేలు దాటకూడదని నిర్దేశించినప్పటికీ రెండు సంస్థలు రూ.4 వేల వరకూ కోట్ చేసినట్లు తెలిసింది. రెండు ప్యాకేజీలకు ఎల్ అండ్ టీ, ఒక ప్యాకేజీకి షాపూర్ పల్లోంజి సంస్థలు ఎల్1గా(లోయస్ట్ బిడ్) నిలిచినా సీఆర్‌డీఏ నిర్దేశించిన రూ.మూడు వేలకు మించి వారు కోట్ చేసిన ధరలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన దానికంటే ఐదు శాతం ఎక్కువ(ఎక్సెస్)కు కోట్ చేస్తే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. కానీ ఈ రెండు సంస్థలు 35 శాతానికంటే ఎక్కువకు కోట్ చేయడంతో ఏంచేయాలనే దానిపై సీఆర్‌డీఏ తర్జనభర్జన పడుతోంది. ఆదివారానికల్లా టెండర్లు ఖరారు చేయాలని భావిస్తున్న తరుణంలో ఈ అడ్డంకి రావడంతో మళ్లీ టెండర్లు పిలవక తప్పదని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు. దీంతో రీ టెండర్లు పిలవాలా, దాఖలైన టెండర్లను ఖరారు చేయడానికి ఏమైనా వీలుందా? అనే విషయాలపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆదివారం ఏ విషయాన్ని తేల్చనున్నారు.