
నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం
► పార్టీ పగ్గాలు శశికళకు దక్కేనా?
► వ్యతిరేకీయుల పంతమే నెగ్గేనా
► సీఎం కూడా శశికళే అంటున్న మంత్రి సెల్లూరు రాజా
సాక్షి ప్రతినిధి, చెన్నై: నేడు గురువారం రాష్ట్రమంతటా ఉత్కంఠ. దేశ మంతటా ఆసక్తి. అందరిచూపులూ అన్నాడీఎంకే వైపు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో చెన్నైలో గురువారం జరుగుతున్న పార్టీ సర్వ సభ్య సమావేశమే ఈ ప్రత్యేక పరిస్థితులకు కారణం.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు జయలలిత మరణంతో ఖాళీ అయ్యాయి. అధికారంలో ఉండడంతో వెంటనే వాటిని భర్తీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 5వ తేదీన జయ మరణించిన అదే రోజు అర్ధరాత్రి సీఎంగా పన్నీర్‌సెల్వం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక పదవి భర్తీ అయింది. ప్రధాన కార్యదర్శి పదవిపై కొద్ది రోజులు మల్లగుల్లాలు పడ్డారు. ఆ తరువాత అన్నాడీఎంకేలోని అగ్రనేతలంతా శశికళ వైపే మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమావేశాలను నిర్వహించి తీర్మానాలు చేయించారు. అమ్మ సమాధి సందర్శన పేరుతో చెన్నైకి రప్పించి తీర్మానాల ప్రతులను శశికళకు అందించారు. ఫ్లెక్సీలు కట్టించి, వార్తా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు గుప్పించి శశికళ పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇటీవల మరికొంత ముందడుగు వేసి ముఖ్యమంత్రిగా కూడా చూడాలని ముచ్చటపడుతున్నారు. అయితే రెండింటికీ ఆమె అర్హురాలు కారంటూ ద్వితీయ, తృతీయ శ్రేణులతోపాటు పార్టీ కేడర్ నిరసన గళం విప్పారు. పార్టీ నియమావళి ప్రకారం సభ్యురాలిగా ఐదేళ్ల సీనియారిటీ లేని శశికళ ఎంపిక చెల్లదని వాదిస్తున్నారు. సవరణలు చేసి ఎన్నుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు.
పార్టీ సమావేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనకుండా శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సర్వ సభ్య సమావేశానికి వచ్చేవారు విధిగా ఆహ్వాన పత్రాలు తీసుకురావలనే షరతు విధించడం తోపాటు, వ్యతిరేకీయులకు ఆహ్వానాలు పంపకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీచేస్తానని బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్‌పై అన్నాడీఎంకే శ్రేణులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్లనే దాడి చేసినట్లు వారు చెబుతున్నారు. మొత్తం మీద వాడివేడి వాతావరణంలో గురువారం పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగనుంది.
సీఎం కూడా శశికళనే: మంత్రి సెల్లూరు రాజా
గురువారం నాటి సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఖాయమని మంత్రి సెల్లూరు రాజా బుధవారం ప్రకటించారు. అంతేగాక సంక్రాంతి పండుగ అనంతరం ముఖ్యమంత్రిగా కూడా శశికళను ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ అధినేత్రిగా జయలలిత అనేక సవాళ్లను ఎదుర్కొన్నపుడు శశికళే అండగా నిలిచారని ఆయన చెప్పారు. గతంలో వలే ప్రస్తుతం కూడా పార్టీలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో ప్రధాన కార్యదర్శి, సీఎంగా శశికళనే సమర్థురాలని ఆయన కితాబు ఇచ్చారు. శశికళ కోసం సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు పన్నీర్‌సెల్వం కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
ప్రజాభిమానికే పట్టం:
సీనియర్ సినీనటి లత ప్రజాభిమానం కలిగిన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని సీనియర్ సినీనటి లత బుధవారం విడుదల చేసిన ప్రకటనలో నర్మగర్భమైన వ్యాఖ్యానాలు చేశారు. తన గురువు, అభిమాని విప్లవనాయకుడు ఎంజీ రామచంద్రన్ స్థాపించిన పార్టీలో గందరగోళ పరిస్థితుల నెలకొనడం మంచిది కాదని అన్నారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే ప్రభుత్వానికి కూడా చేటుతెస్తాయని హెచ్చరించారు. ఎంజీఆర్, జయలలితలా ప్రజాభిమానం కలిగిన నేతను ఎన్నుకోవాలని, ప్రజల తీర్పే పరమేశ్వరుని తీర్పుగా ఎన్నిక ప్రక్రియ సాగాలని ఆమె సూచించారు. అగ్రనేత నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ కోరుకునే వ్యక్తే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని పేర్కొనడం ద్వారా శశికళ ఎంపికను లత పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేగాక జయవలెనే తాను కూడా ఎంజీఆర్ శిష్యురాలినేనని అన్నాడీఎంకేకు గుర్తుచేయడం గమనార్హం.