నేడు ప్రధానితో చర్చలు
Published Fri, Dec 27 2013 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీలంక సముద్రతీర భద్రతా దళాల వేధింపులతో విసిగివేసారిన తమిళ జాలర్లు నేరుగా ప్రధానికే మొరపెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జాలర్ల సంఘాలకు చెందిన 20 మందితో కూడిన ప్రతినిధి బృందం చెన్నైలో గురువా రం ఢిల్లీకి పయనమైంది. తమ దేశ సరిహద్దులోని కచ్చదీవుల వద్ద తమిళ జాలర్లు చేపలవేట సాగిస్తున్నారని శ్రీలంక ప్రభుత్వం ఆరోపిస్తోంది. చేపల వేటకు వెళ్లిన జాలర్లపై శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు దాడులకు దిగడంతోపాటు అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నాయి. వారి పడవలను అపహరించుకు వెళుతున్నాయి. వలలను ధ్వంసం చేస్తున్నాయి. హద్దు దాటలేదన్న తమిళ జాలర్ల గోడును శ్రీలంక వినిపించుకోవడం లేదు.
జాలర్ల సంఘాల లెక్క ప్రకా రం శ్రీలంక జైళ్లలో 210 మంది మగ్గుతున్నారు. 75 మరపడవలు వారి కబంద హస్తాల్లో చిక్కుకున్నాయి. శ్రీలంక దాష్టీకా న్ని ముఖ్యమంత్రి జయలలిత అనేక ఉత్తరాల ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. డీఎంకే అధినేత కరుణానిధి సైతం కేంద్రానికి అనేకసార్లు విన్నవించారు. ఇటీవల శ్రీలంకలో కామన్వెల్త్ సమావేశాలు జరిగినప్పుడు జాలర్ల సమస్యను ప్రస్తావించాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా ప్రయో జనం లేదు. ఈ క్రమంలో కేంద్రం నిర్లక్ష్యం గా వ్యవహరించడం వల్లే దాడులు పెరిగిపోయాయని జాలర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నాగపట్నం జిల్లా అక్కరపేటకు చెందిన జాలర్ల కుటుంబాల వారు ఈ నెల 11వ తేదీ నుంచి, తాలూకాకు చెందిన జాలర్లు 16వ తేదీ నుంచి దీక్షలు ప్రారంభించారు. కొందరు చేపల వేటను బహిష్కరించారు.
ఇదిలా ఉండగా నాగపట్నం, పుదుకోట్టై జాలర్ల సంఘాల నేతలు ఈ నెల 12 వ తేదీన సీఎం జయలలితను చెన్నైలో కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఆమె ప్రభుత్వ పరం గా అన్నిరకాల మద్దతు ఇస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే ఆయా సంఘాల వారు డీఎంకే అధినేత కరుణానిధిని కూడా కలిశారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ పార్లమెంటరీ నేత టీఆర్ బాలు నాగపట్నం వెళ్లి జాలర్లతో చర్చలు జరిపారు. ప్రధాని వద్దకు తీసుకెళతానని టీఆర్ బాలు హామీ ఇవ్వడంతో ఈ నెల 24వ తేదీన జాలర్లు సమ్మె విరమించారు. మరో వర్గం మాత్రం తమ విధుల బహిష్కరణను కొనసాగిస్తోంది. వారి దీక్ష గురువారానికి 16 వ రోజుకు చేరుకుంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీలో ప్రధానిని కలిసేందుకు టీఆర్ బాలుతో కలిసి 20 మందితో కూడిన జాలర్ల సంఘాల ప్రతినిధులు చెన్నై విమానాశ్రయంలో గురువారం బయలుదేరారు.
Advertisement
Advertisement