చెన్నై, సాక్షి ప్రతినిధి:అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం రాష్ట్రం మొత్తం సిద్దమైంది. ఆదివారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, విద్యాలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు యోగా డే కోసం సన్నాహాలు పూర్తిచేసుకున్నాయి. ఈనెల (జూన్) 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించగానే దేశం యావత్తు ఇందుకు సిద్దమైంది. యోగా ఒక మతానికి పరిమితమని కొన్ని రాజకీయ పార్టీలు, మితవాద సంస్థలు విమర్శలు గుప్పించినా ఎక్కడిక క్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు సాగాయి. ఐక్యరాజ్యసమితి పిలుపునందుకున్న కేంద్రప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించేందుకు నడుంబిగించింది. ప్రధాని నరేంద్రమోదీ డిల్లీలో లక్షలాది మందితో కలిసి యోగాలో పాల్గొంటున్నారు. ఇక తమిళనాడుకు సంబంధించి ప్రభుత్వ పరంగా భారీ ఎత్తున కార్యక్రమాల రూపకల్పన సాగలేదు. అయితే ఇతరత్రా అపూర్వ స్పందన నెలకొంది.
ముఖ్యంగా విద్యాసంస్థలు భారీస్థాయిలో జరిపేందుకు సిద్దమైనారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఈషా ఫౌండేషన్ వారు చెన్నై వైఎమ్‌సీఏ మైదానంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో 40 వేల మంది పాల్గొంటారని అంచనా. ప్రముఖ గురువు జగ్గీ వాసుదేవన్ సమక్షంలో సాగే యోగా కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఉదయం 6.15 గంటలకు జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారు. ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాధన్ గాత్ర కచ్చేరీని సైతం ఏర్పాటు చేసారు. అలాగే కోడంబాకంలో బ్రహ్మకుమారీలు పలు కార్యక్రమాలను జరుపుతున్నారు. రాజయోగం, అవగాహ న, ధ్యానం క్లాసులను నిర్వహిస్తున్నారు. చెన్నై పచ్చపాస్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రయివేటు పాఠశాల మైదానంలో యోగా నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో మెరీనాబీచ్‌లోనూ, సైనికదళాల ఆధ్వర్యంలో థీవుతిడల్‌లో, నౌకాదళం నేతత్వంలో గస్తీదళాల మైదానంలో యోగా నిర్వహిస్తారు. అలాగే చెన్నై సచివాలయంలో సైతం ప్రత్యేక యోగా క్లాసులు జరపాలని నిర్ణయించారు.
డీఎండీకే కార్యాలయంలోనూ యోగా జరుపుతారు. యోగా నిర్వహణ పట్ల కొందరు మత విద్వేషాలను వెదజల్లడంతో పోలీసు వర్గాలు అప్రమత్తమైనాయి. ముఖ్యమైన కూడళ్లు, భారీ సంఖ్యలో యోగా నిర్వహించే చోట్ల భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడే యోగాకు కొందరు మతం రంగుపులమడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. తమిళనాడు ప్రభుత్వం సైతం పెద్దగా స్పందించక పోవడం విచారకరమని అన్నారు. ప్రజలందరికీ ప్రయోజనకరమైన యోగాను తరగతుల్లో పాఠ్యాంశంగా చేర్చాలని, ప్రతిరోజు విద్యార్థులకు యోగా శిక్షణ నివ్వాలని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుల డాక్టర్ అన్బుమణి రాందాస్ సూచించారు.
నేడు యోగా డే
Published Sun, Jun 21 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM
Advertisement
Advertisement