- నాలుగు నియోజకవర్గాల్లో పర్యటన
- ఉదయం 10 గంటలకు ఓడీసీ
- సాయంత్రం 4 గంటలకు మడకశిర
- సాయంత్రం 6 గంటలకు హిందూపురం
- రాత్రికి కదిరిలో బస
సాక్షి, అనంతపురం : ‘వైఎస్సార్ జనభేరి’లో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీచేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ షర్మిల ప్రచారం కొనసాగనుంది.
ఈ నెల 24నే జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించాల్సి ఉండగా వైఎస్సార్‌సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెండంతో షర్మిల తన పర్యటన రద్దు చేసుకున్న విషయం విదితమే. వైఎస్సార్ జిల్లా పులివెందుల నుంచి కదిరి మీదుగా శనివారం ఉదయం 10 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవర చెరువుకు షర్మిల చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో, సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4 గంటలకు మడకశిరకు చేరుకుని రోడ్‌షో, బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు హిందూపురం చేరుకుని రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కదిరికి చేరుకుని రాత్రికి బస చేస్తారు. ఆదివారం ఉదయం రోడ్డుమార్గంలో చిత్తూరు జిల్లాకు బయల్దేరి వెళ్తారు. షర్మిల పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఉరకలేస్తున్న ఉత్సాహం
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16, 17 తేదీల్లో జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. జననేత నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలు, రోడ్‌షోలకు జనం పోటెత్తారు. ఈ జనసందోహాన్ని చూసిన ప్రత్యర్థి పార్టీల గుండెల్లో దడ మొదలైంది.
జగన్ సభలకు పోటెత్తిన జనసందోహాన్ని చూసిన టీడీపీ అభ్యర్థులు.. ఈ హోరులో తాము గెలవగలుగుతామా అన్న ఆందోళనలో పడ్డారు. తెలుగుతమ్ముళ్లు ఆ షాక్ నుంచి తేరుకోకముందే..జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో పర్యటించనుండడంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జననేత సభలకు జనసందోహం పోటెత్తడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. ఇదే ఉత్సాహంతో షర్మిల ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమయ్యారు.