విలువలకు పట్టం కట్టండి | To be crowned values | Sakshi
Sakshi News home page

విలువలకు పట్టం కట్టండి

Published Thu, Apr 17 2014 2:40 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

విలువలకు పట్టం కట్టండి - Sakshi

విలువలకు పట్టం కట్టండి

కుళ్లు, కుతంత్రాలకు సమాధి కట్టండి  ‘అనంత’ పర్యటనలో వైఎస్ జగన్ పిలుపు
 
 అనంతపురం: ‘‘విశ్వసనీయత, నిజాయితీతో కూడిన రాజకీయాలకు.. కుళ్లు కుతంత్ర రాజకీయాలకు మధ్య సాగుతున్న సమరంలో నైతిక విలువలకు పట్టం కట్టండి. కుళ్లు కుతంత్ర రాజకీయాలకు సమాధి కట్టండి. రాష్ట్రంలో మళ్లీ రాజశేఖరుడి సువర్ణయుగానికి నాంది పలకండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘చంద్రబాబు చస్తే నిజాలు చెప్పరు.. చెప్పిన అబద్ధమే చెప్పి.. వంద సార్లు అబద్ధాలు చెప్పి అదే నిజమని నమ్మించే రకం చంద్రబాబు. అధికారం కోసం ఓ రోజు రుణాలు మాఫీ చేస్తా.. మరో రోజు సైకిళ్లు ఫ్రీగా ఇస్తానంటారు.. ఇంకోరోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటారు.. మరొక రోజు అన్నీ మీ ఇంటివద్దకు తెచ్చిస్తా అంటూ అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నికలయ్యాక ప్రజలతో నాకేం పనుందిలే అంటూ మోసం చేస్తారు.. అధికారంలో ఉన్నప్పుడే ప్రజలకు ఏ ఒక్క మేలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు చెబుతోన్న మాటలు వింటుంటే అమ్మకు అన్నం పెట్టనివాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నట్లుంది’’ అని విమర్శించారు. ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. బహిరంగ సభల్లో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
 
రాష్ట్ర దశ, దిశ మారుస్తా..

 నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఘడియల్లో.. ఆ వేదికపైనే చేసే సంతకాలు ఈ రాష్ట్ర ప్రజల దశ, దిశ కచ్చితంగా మార్చగలవని హామీ ఇస్తున్నా. అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో కరువుతో అక్కాచెల్లెళ్లు గుంటూరు జిల్లాలో మిర్చి తోటల్లో కూలి పనుల కోసం వలస వెళ్తున్నారు.. ఒక రోజు చేస్తే రూ.150 కూలీగా వస్తుంది.. ఆ డబ్బులు మూడు రోజులు తిండికి సరిపోతాయి.. ఆ తర్వాత మళ్లీ కూలీకి వెళ్లాల్సిన దుస్థితి.. దీంతో బడికెళ్లాల్సిన తమ పిల్లలను కూడా కూలి పనులకు తీసుకెళ్తున్నారు. పిల్లలకు రోజు ఇచ్చే కూలీ రూ.50తో మరో రోజు గడస్తుందని వారి ఆశ. అక్కాచెల్లెళ్లను ఆ కష్టాల నుంచి బటయపడేసేందుకు ‘అమ్మ ఒడి’ పథకంపై తొలి సంతకం చేయబోతున్నా. పిల్లలను బడికి పంపితే.. బిడ్డకు రూ.500 చొప్పున, ఇద్దరు పిల్లలైతే రూ.1000 నెల నెలా తల్లి ఖాతాలో జమ చేస్తా. ఆ రూ.వెయ్యి అక్కా చెల్లెమ్మల జీవితానికి భరోసాను ఇస్తుంది. మీ పిల్లలను ఇంజనీర్లుగానూ.. డాక్టర్లుగానూ తీర్చిదిద్దుతానని మీ తమ్ముడిగా, అన్నగా.. మీ పిల్లలకు మేనమామగా హామీ ఇస్తున్నా.

 ‘నాయనా మీ నాయన పుణ్యాన రూ.200 పెన్షన్ ఇస్తున్నారు.. కానీ మూడు పూటలా తిండి తినాలంటే కూలి పనులకు వెళ్లక తప్పడం లేదు’ అని అవ్వాతాతలు చెబుతున్నారు. ఆ అవ్వాతాతలకు ఓ మనవడిగా భరోసా ఇస్తున్నా. నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా       రెండో సంతకం చేస్తా.రైతు పంట పండించినపుడు గిట్టుబాటు ధర ఉండదు.. పంట విక్రయించాక ధరలు పెరుగుతాయి.. దళారులు లాభపడుతున్నారు.. రైతులు నష్టపోతున్నారు. ఈ కష్టాలు తప్పించేం దుకు, రైతులకు మద్దతుధర  కల్పించడం కోసం రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తా. కరవు, వరద వచ్చినప్పుడు తక్షణమే పరిహారం అందించి.. రైతును ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో సహాయ నిధి ఏర్పాటుచేస్తా.. ఖరీఫ్‌లో పంట నష్టపోతే రబీ నాటికి పంటనష్ట పరిహారం అందిస్తా.నాలుగో సంతకం అక్కాచెల్లెళ్ల కోసమే చేయబోతున్నా. డ్వాక్రా మహిళలు ఆర్థిక ఇబ్బం దుల వల్ల ఏ నెల వాయిదా అయినా చెల్లించకపోతే.. రెండ్రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నారు. అది చెల్లించలేక అక్కాచెల్లెళ్లు సతమతమవుతున్నారు. ఈ ఇబ్బందుల నుంచి అక్కాచెల్లెళ్లను తప్పించేందుకు రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.
 
జనసేవా కేంద్రాల ఏర్పాటు కోసం ఐదో సంతకం చేయబోతున్నా. ఇప్పుడు ఊళ్లలో ఎవరికైనా రేషన్‌కార్డు, పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు కావాలంటే.. అధికారులు, నాయకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ బాధలు లేకుండా చేస్తా. ఏ కార్డు కావాలన్నా సంబంధిత వార్డులోనే.. గ్రామంలోనే.. అది కూడా 24 గంటల్లోగా కార్డు ఇప్పించేలా ప్రత్యేక కేంద్రాలను అవే వార్డుల్లో, గ్రామాల్లో ఏర్పాటుచేస్తా.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నమైన ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నీరుగార్చింది. ఇప్పుడు ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వల్ల రోగులను గౌరవించడం లేదు. 133 రోగాలను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించారు. నేను ముఖ్యమంత్రినయ్యాక ఆరోగ్యశ్రీని మళ్లీ బాగు చేస్తా. అంతేకాదు ఇంకో పని కూడా చేస్తా. యాక్సిడెంట్‌లో గాయపడి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వారు వెంటనే పనికి వెళ్లలేరు. డాక్టర్ సూచన మేరకు వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే.. అన్ని రోజులు నెలకు రూ.3 వేల చొప్పున సహాయంగా అందిస్తా.
 
ఈ రోజు రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలీదు. నేను సీఎం అయ్యాక 2019 నాటికి విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. వ్యవసాయానికి 7 గంటల ఉచిత కరెంటు పట్టపగలే అందిస్తా.ఇంజనీర్లు, డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఇప్పుడు బెల్ట్‌షాపుల వల్ల దారితప్పుతున్నారు. నేను ముఖ్యమంత్రినయ్యాక బెల్ట్‌షాపులను మూసివేయిస్తా. బెల్ట్‌షాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పది మంది ఆడ పోలీసులను నియమిస్తా. ప్రతి నియోజకవర్గానికి ఓ చోట మాత్రమే మద్యం దుకాణం ఉంటుంది.. ఆ షాపును కూడా ప్రభుత్వమే నడుపుతుంది. అక్కడ కూడా మద్యం ధరలు షాక్ కొట్టే విధంగా ఉంటాయి.
 
చంద్రబాబు తరహాలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ అబద్ధాలు చెప్పడం నాకు చేత కాదు. ప్రతి ఇంటికీ ఓ డాక్టరో.. ఇంజనీరో ఉంటేనే పేదరికం పోతుంది. అందుకు ప్రతి స్కూల్లో ఇంగ్లీషు మీడియం పెడతా. అమ్మ ఒడి పథకం కింద మీ పిల్లలను ఇంజనీరుగా.. డాక్టరుగా తీర్చిదిద్దుతా.. సొంత తమ్ముడు, చెల్లెమ్మకు ఉద్యోగం కోసం ఎంత కష్టపడతానో అదే రీతిలో కష్టపడి మీ పిల్లలకు ఉద్యోగం వచ్చేలా చూస్తా.
 
 నేడు వైఎస్ జగన్ నామినేషన్
 
పులివెందుల, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.  ఉదయాన్నే ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించిన అనంతరం నేరుగా ఆయన పులివెందులకు రానున్నారు. వైఎస్సార్ సీపీ పులివెందుల శాసనసభ అభ్యర్థిగా  ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య  నామినేషన్ వేయనున్నారు.
 
 ఇంటితోపాటు పత్రాలూ.. రుణం కూడా

ఇప్పుడు 2014.. 2019 నాటికి ఏ గ్రామానికైనా వెళ్లి ఇళ్లులేని వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే ఒక్క చేయి కూడా పైకి లేపని విధంగా పాలన అందిస్తా. రాష్ట్రాన్ని గుడిసే లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. నేను ఏడాదికి 10 లక్షల ఇళ్ల చొప్పున ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తా. అంతేకాదు మీరు ఇంటికి మార్జిన్ మనీ కట్టనవసరం లేదు. రూ.లక్ష వ్యయంతో ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాదు.. ఆ ఇంటికి సంబంధించిన పత్రాలను కూడా అక్కాచెల్లెమ్మలకు అందిస్తా.. ఆ ఇంటి పత్రాలను తనఖా పెడితే రూ.30 వేలను పావలా వడ్డీకే రుణంగా ఇచ్చేలా బ్యాంకర్లతో నేను మాట్లాడతా.
 
150 యూనిట్లు కరెంటు రూ.100కే..

 మూడు బల్బులు, రెండు ఫ్యాన్‌లు, ఒక టీవీ ఉన్న ఇంటికి ఇప్పుడు బిల్లు రూ.550 వరకూ వస్తోంది.. నేను ముఖ్యమంత్రినయ్యాక ఆ దుస్థితి లేకుండా చేస్తా.. ఒక టీవీ, రెండు ఫ్యాన్‌లు, మూడు బల్బులు ఉన్న ఇంటికి ఖర్చయ్యే 150 యూనిట్లకు రూ.100మాత్రమే బిల్లు వచ్చేలా చూస్తా.. అది ప్రజల హక్కుగా మార్చుతా.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement