జననేతకు బ్రహ్మరథం
- జిల్లాలో ఆరు రోజులు 10 నియోజకవర్గాల్లో పర్యటన
- ప్రతిచోటా వెల్లువెత్తిన అభిమానం
- జనం కష్టాలు విని... కన్నీళ్లు తుడిచిన జగన్
- రాజన్య రాజ్యంతో బాధలుండవని భరోసా
పశ్చిమకృష్ణా, న్యూస్‌లైన్ : మండటెండల్ని సైతం లెక్కచేయలేదు. చిమ్మచీకటికి వెనకాడలేదు. రాజన్న బిడ్డను చూసేందుకు, తమ కష్టాలు చెప్పుకొనేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తామని చాటిచెప్పారు. గత నెల 29న జిల్లాలోని గన్నవరంలో ప్రారంభమైన జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జనభేరి ప్రచార యాత్ర ఆదివారం రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో ముగిసింది.
ఆరు రోజులపాటు జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన జననేత పది నియోజకవర్గాల్లో సభలు నిర్వహించారు. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, బంటుమిల్లి, కైకలూరు, తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు జనం పోటెత్తారు. ఈ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్‌షోలలో జగన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లారు. వారి కష్టాలు విన్నారు. బాధలు తెలుసుకున్నారు. నేనున్నా.. భయపడొద్దంటూ భరోసా ఇచ్చారు.
కష్టాలు.. కన్నీళ్లు...
ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో జీవితాలు దుర్భరంగా మారాయని పలు నియోజకవర్గాల్లో జనం ఏకరువు పెట్టారు. కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నామని వాపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తమ పిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ అందడం లేదని, పింఛన్లు సక్రమంగా రావడం లేదని, మద్యం మహమ్మారి కుటుంబాలను కూల్చేస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. సొంతిల్లు కలగా మారిందని, డ్వాక్రా రుణాలు రావడం లేదని మహిళలు ఆవేదన వెలిబుచ్చారు.
గత పాలకులు వ్యవసాయాన్ని దండగలా మార్చేశారని రైతన్నలు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగం దక్కడం లేదని యువత ఆవేదన వెలిబుచ్చింది.
నేనున్నానని...
జనం కష్టాలు విన్న జననేత మీ కష్టాలు తీర్చేందుకు నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. కొద్దిరోజుల్లో రాజన్య రాజ్యం వస్తోందని, అప్పుడు మీ బాధలు తీరతాయని ఓదార్చారు. ధరల స్థిరీకరణ నిధి, ప్రత్యేక విపత్తు నిధులతో వ్యవసాయాన్ని పండగ చేస్తానని చెప్పారు. రూ.100కే 150 యూనిట్ల కరెంట్ వస్తోందని, ఆరోగ్య సిరులు కురిపిస్తానని, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. చెల్లెమ్మలకు, అక్కయ్యలకు కొత్త రుణాలు అందిస్తానన్నారు.
అమ్మ ఒడితో పిల్లలందరినీ ఒడికి పంపిస్తానని, బాగా చదివించి డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అవ్వా, తాతలకు ప్రస్తుతం రూ.200 చొప్పున ఇస్తున్న పింఛను మొత్తాన్ని రూ.700కు పెంచుతానని స్పష్టం చేశారు. ఆ మొత్తం ఠంచనుగా అందే ఏర్పాటు చేస్తానన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. మద్యం బెల్ట్‌షాపుల్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయతానురాగాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు.
ప్రత్యర్థులకు హడల్...
జిల్లాలో జననేత సుడిగాలి పర్యటన టీడీపీ నాయకుల్ని హడలెత్తించింది. జగన్ సభలకు జనం వెల్లువెత్తడంతో ఇక తమ పని ఖాళీ అవుతుందనే భయం వారిని వెంటాడుతోంది. జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సభలకు మొక్కుబడిగా జనం రావడం, గత నెల విజయవాడలో నిర్వహించిన టీడీపీ మహిళా గర్జన అట్టర్‌ఫ్లాప్ కావడం వంటివాటిపై వారు మధనపడుతున్నారు. జన సునామీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన జగన్‌మోహన్‌రెడ్డి సభల్ని చూసి టీడీపీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి.