జన ఉప్పెన | Y. S. jagan mohan reddy YSR Janabheri | Sakshi
Sakshi News home page

జన ఉప్పెన

Published Thu, May 1 2014 1:06 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

Y. S. jagan mohan reddy YSR Janabheri

  • ఆరు నెలల్లో పోర్టు పనులు
  •  జనభేరి సభలో జగన్ హామీ
  •  దివిసీమ నుంచి ఉయ్యూరు వరకు జనభేరి
  •  అడుగడుగునా విశేషాదరణ
  •  అందరినీ పలకరిస్తూ సాగిన జగన్ ఎన్నికల ప్రచారం
  •  సీఎం అయిన ఆరు నెలల్లో బందరు పోర్టు పనులు చేపడతామని హామీ
  •  చంద్రబాబుపై నిప్పులు చెరిగిన జననేత
  •  వైఎస్ సువర్ణయుగాన్ని తెచ్చేలా ఐదు సంతకాలు, ఆరు పనులు
  •  చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరులో పోటెత్తిన జనం
  • అవును.. అది నిజంగా ఉప్పెనే.. జన ఉప్పెన.. మూడున్నర దశాబ్దాల క్రితం వచ్చిన సముద్ర ఉప్పెన ప్రజలను కలవరపెడితే.. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కోసం వచ్చిన జన ఉప్పెన ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో గుబులు పుట్టించింది. మండుటెండను సైతం లెక్కచేయక అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి సెంటర్‌లో పోటెత్తిన ఈ ఉప్పెన పామర్రును తాకుతూ పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు వరకు సాగింది. దాదాపు మూడు నియోజకవర్గాల్లో 18 ప్రాంతాలను తాకుతూ 41 కిలోమీటర్ల మేర ఎన్నికల జనభేరి మోగించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం అపూర్వ స్వాగతం పలికారు.
     
    సాక్షి ప్రతినిధి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల జనభేరి రెండోరోజైన బుధవారం కూడా అపూర్వ జనాదరణ మధ్య సాగింది. దారిపొడవునా ఆయన కారుకు అడ్డుపడిన వృద్ధులు, మహిళలు, యువకులు జననేతకు కరచాలనం, పలకరింపు కోసం పోటీపడ్డారు. చల్లపల్లిలోని సన్‌ఫ్లవర్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ‘కాబోయే సీఎంకు బెస్ట్ ఆఫ్ లక్, వైఎస్ సువర్ణయుగం-జగనన్నకే సాధ్యం’ అనే ప్లకార్డులతో జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు.

    జనభేరి యాత్ర ప్రారంభానికి ముందు జిల్లాకు చెందిన పలువురు నేతలు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అనంతపురం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు సైతం ఇక్కడికి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు సభల్లో ప్రసంగించిన జగన్‌మోహన్‌రెడ్డి దాదాపు 41 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించి తన కోసం ఎదురుచూసిన జనాన్ని ఆప్యాయంగా పలకరించారు.

    అన్నా మీకే ఓటేస్తామంటూ మహిళలు, యువత ఆయనకు భరోసా ఇచ్చారు. ‘మీ అయ్య చేసిన మంచి పనులు కొనసాగించేందుకు నీకే ఓటేస్తాం బాబా’ అంటూ వృద్ధులు నిండు మనస్సుతో దీవించారు. దారి పొడవునా పూల జల్లులతో స్వాగతం పలికిన జనం హారతులు పట్టి.. చేతిలో చేయేసి గెలుపు నీదేనంటూ భరోసా ఇవ్వడం విశేషం.
     
    ఆకట్టుకున్న ప్రసంగం..
     
    మూడు నియోజకవర్గాల్లో జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆల్ ఫ్రీ బాబుగా గుర్తింపు పొందిన చంద్రబాబు మరోమారు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన మీ ముందుకు వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. తాను ఐదు సంతకాలతో ఆరు పనులు చేసి మొత్తం పదకొండు పనులు చేస్తానని చెప్పారు. జననేత వెంట పార్టీ బందరు లోక్‌సభ అభ్యర్థి కేపీ సారథి, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, బందరు, పెడన నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు సింహాద్రి రమేష్, ఉప్పులేటి కల్పన, కేవీఆర్ విద్యాసాగర్, పేర్ని నాని, బూరగడ్డ వేదవ్యాస్, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాతినేని పద్మావతి, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
     
     ఆరు నెలల్లో పోర్టు పనులు..

     తాను ముఖ్యమంతి అయిన ఆరునెలల్లో ఈ ప్రాంతానికి అతి కీలకమైన బందరు పోర్టు పనులు ప్రారంభిస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బందరు ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని నాని అన్న తనను ఒక కోరిక కోరాడని, అన్నా మీరు బందరు పోర్టు నిర్మాణం చేస్తానని హామీ ఇవ్వాలని అడిగాడని చల్లపల్లి సభలో జగన్‌మోహన్‌రెడ్డి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. ఈ ప్రాంత ప్రజల ప్రగతి కోసం కచ్చితంగా తాను బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టి తీరుతానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. బందరు పోర్టు నిర్మాణంతో పరిశ్రమల స్థాపన, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బందరు పోర్టును రాజకీయ కోణంలో కాకుండా ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చూడాలన్నారు. అందుకే నాని అన్న కోరిక మేరకు తాను బందరు పోర్టు నిర్మాణాన్ని చేపట్టి చూపిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement