ఎల్బీటీ రద్దు ? | Traders tell state to revoke local body tax by June 5 | Sakshi
Sakshi News home page

ఎల్బీటీ రద్దు ?

Published Tue, May 27 2014 10:34 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Traders tell state to revoke local body tax by June 5

సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఆక్ట్రాయి (రవాణా సుంకం) బదులుగా ప్రవేశపెట్టిన ‘లోకల్‌బాడీ ట్యాక్స్’ (స్థానిక సంస్థల పన్నుల)ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారికంగా వివరాలు తెలిపేందుకు ఎవరూ ముందుకు రాకపోయినప్పటికీ  లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో అప్రమత్తమయిన ప్రజాస్వామ్య కూటమి ఎల్బీటీపై ఒక అడుగు వెనక్కి తగ్గనుందని తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎల్బీటీని రద్దు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అధికారి పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకుని మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎల్బీటీని రద్దు చేయడం అనివార్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల్లో అనేక మందిని తమవైపు తిప్పుకోవడానికి ఎల్బీటీ రద్దు ఉపకరిస్తుందని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు సూచిస్తున్నట్టు సమాచారం.   ఈవారంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో ఎల్బీటీని రద్దు చేసి వ్యాట్‌పై సర్‌చార్జీ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మంత్రాలయ వర్గాలు తెలిపాయి.

 ధరల దడ
 అయితే వ్యాట్‌పై సర్‌చార్జీ విధిస్తే రాష్ట్రంలోని అనేక వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయంపై అందరితో చర్చలు జరిపిన తర్వాతే తుది నిర్ణయానికి రావొచ్చు. ముంబై మినహా రాష్ట్రంలోని 25 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆక్ట్రాయ్ రద్దు చేసి ఎల్బీటీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీటీ విధింపుపై వ్యాపారవర్గాలన్నీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దీని వల్ల తీవ్రనష్టం వస్తోందని ఆక్షేపిస్తున్నాయి. ఈ సుంకాన్ని వ్యతిరేకిస్తూ పలుసార్లు ఆందోళనలు నిర్వహించాయి. ఎల్బీటీకి బదులుగా వ్యాట్‌పై సర్‌చార్జి వసూలు చేయాలని ఇవి ప్రభుత్వానికి సూచించాయి.

 అయినప్పటికీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఎల్బీటీ అమలుకే మొగ్గుచూపారు. దీంతో వాణిజ్యవర్గాల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీకి చేదు ఫలితాలను మిగిల్చాయి. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యాపార, వాణిజ్యవర్గాలను ఆకట్టుకునేందుకు డీఎఫ్ కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎల్బీటీని రద్దు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

 మున్సిపాలిటీలకు ముప్పే..
 నిజానికి ఎల్బీటీ కారణంగా మున్సిపల్ కార్పొరేషన్లు ఆర్థికంగా బలపడ్డాయి. దాదాపు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయం రూ.14 వేల కోట్ల వరకు చేరింది. వ్యాట్‌పై ఒకటి లేదా రెండు శాతం సర్‌చార్జ్ వసూలు చేస్తే కేవలం రూ.1,300 కోట్ల వరకు ఆదాయం రానుంది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్లకు రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్ల మేర సబ్సిడీ ఇచ్చేందుకు జూన్‌లో ప్రకటించే బడ్జెట్‌లో నిధులు కేటాయించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ కార్పొరేషన్లన్నీ ఆర్థిక ఇబ్బందులతో తిప్పలు పడే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాట్ ద్వారా సుమారు రూ.65 వేల కోట్ల ఆదాయం వస్తోంది.

అయితే మున్సిపల్ కార్పొరేషన్ల సబ్సిడీల కోసం వ్యాట్‌ను మరింత పెంచాల్సి ఉంటుంది. వ్యాట్ ఏయే ఉత్పత్తులపై పెంచాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తప్పనిసరి అయితే మద్యం, సిగరెట్, గుట్కా వంటి మత్తుపదార్థాలతోపాటు పెట్రోలియం ఉత్పత్తులపై పెంచవచ్చని చెబుతున్నారు.

 ఇదే జరిగితే రాష్ట్రంలో మరోసారి అన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ పరిణామం డీఎఫ్ కూటమికి ఏ మేరకు లాభం చేస్తుందనే దానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement