'టీడీపీకి ఇది గ్రేస్ పీరియడ్'
హైదరాబాద్: టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక ముఠా నాయకుడని ఆ పార్టీ నేతలు అబద్ధాలతో ఊరేగుతున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఏపీ అగ్రభాగాన ఉండాలి, తెలంగాణ అట్టడుగున ఉండాలి అనేది టీటీడీపీ నేతల కుట్ర అన్నారు. టీటీడీపీ నేతల బహిరంగ చర్చ సవాలుకు మా సర్పంచులు చాలని ఎద్దేవ చేశారు. తెలంగాణా లో ఉన్న దాదాపు 15 వేల గ్రామాల్లో ఎక్కడైనా టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సర్పంచులు సిద్ధంగా ఉన్నారన్నారు. దళితుల భూ పంపిణీ కోసం 9,663 ఎకరాలు ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయం వాస్తవం కాదా.. టీడీపీ నేతల కళ్ళకు ఇవి కనబడడం లేదా అని ప్రశ్నించారు.
రాళ్లు రప్పలు ఉన్న భూములను దళితులకు కేటాయించి పట్టాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించినా ఘనత టీడీపీ, కాంగ్రెస్ పాలకులదే అని డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని.. 2 లక్షల 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని.. మోడల్ ఇళ్ళ నిర్మాణం ఎర్రవల్లి కే పరిమితం కాదని రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు. పని అయిపోయింది టీఆర్‌ఎస్‌ది కాదని.. టీడీపీయే ఇపుడు గ్రేస్ పీరియడ్ లో నడుస్తోందన్నారు.