
ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు దినకరన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. పుదుచ్చేరి క్యాంపులో ఉన్న తిరుగుబాటు శాసనసభ్యులు వెంటబెట్టుకుని ఆయన ఇవాళ రాజ్‌భవన్‌కు వచ్చారు. తగిన సంఖ్యాబలం లేని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని దినకరన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం దినకరన్ మాట్లాడుతూ...పళనిస్వామిని విశ్వాస పరీక్షకు ఆదేశించాలని కోరామన్నారు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, పదవిలో కొనసాగే నైతికత పళనిస్వామికి లేదని అన్నారు.
ఈపీఎస్, ఓపీఎస్‌లను తక్షణమే పదవుల నుంచి తొలగించాలన్నారు. కాగా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, తదుపరి చర్యలకు సమయం కావాలని గవర్నర్ అన్నారని దినకరన్ తెలిపారు. కాగా గత నెలలో గవర్నర్ వద్దకు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లగా ఈసారి దినకరనే వారిని వెంటపెట్టుకుని వెళ్లారు. గవర్నర్‌ను తొలిసారి కలిసినపుడు కంటే ఈసారి ఆయన ఎమ్మెల్యేల సంఖ్యా బలం 19 నుంచి 21కి పెరిగింది. అంతేగాక తన మద్దతుదారులైన ఆరుగురు ఎంపీలను కూడా తీసుకెళ్లారు.