
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
- ఆ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నారు
- వారి డిమాండ్ మేరకు బలపరీక్ష నిర్వహించలేం
- ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన గవర్నర్ విద్యాసాగర్‌రావు
సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపలను రేపుతూనే ఉంది. దాదాపు 20మందికిపైగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతలు గురువారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ కోరారు. అయితే, ప్రతిపక్షాల విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని, కాబట్టి రెబల్స్ డిమాండ్ మేరకు తాను నడుచుకోలేనని ఆయన షాక్ ఇచ్చారు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారని ప్రతిపక్ష వీసీకే పార్టీ నేత తిరుమవలవాన్ తెలిపారు.
ప్రస్తుతం దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు రిసార్ట్‌లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్‌రావు అసెంబ్లీని సమావేశపరిచి.. బలపరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారా అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పట్లో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా బలపరీక్ష ఉండబోదనే సంకేతాలు తాజాగా గవర్నర్ ఇచ్చినట్టయిందని, ఇది దినకరన్ వర్గానికి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.