మహారాష్ట్రీయుల ఆరాధ్య దైవమైన ‘తుల్జాభవాని మాత’ మందిరంలో భక్తులు సమర్పించుకున్న కానుకలు, నగదు మాయమయ్యాయి.
వందల కిలోల బంగారు, వెండి ఆభరణాలు స్వాహా
సాక్షి, ముంబై: మహారాష్ట్రీయుల ఆరాధ్య దైవమైన ‘తుల్జాభవాని మాత’ మందిరంలో భక్తులు సమర్పించుకున్న కానుకలు, నగదు మాయమయ్యాయి. ఆలయ యాజమాన్యం, పూజారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ ఎత్తున బంగారు, వెండి కానుకలు, నగదు కాజేసినట్లు ప్రత్యేకంగా చేపట్టిన ఆడిట్ నివేదికలో స్పష్టమైంది. దీంతో ఈ కేసు దర్యాప్తును సీఐడీ కి అప్పగించారు.
ఉస్మానాబాద్‌లోని ఈ ఆలయంలో 1989 నుంచి 2009 మధ్య 20 ఏళ్ల కాలంలో భవానీ మాతకు భక్తులు సమర్పించుకున్న 120 కిలోల బంగారం, 480 కేజీల వెండి ఆభరణాలు, రూ.240 కోట్ల నగదు మాయమైనట్లు ఆడిట్‌లో వెల్లడైంది. వీటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, లెక్కలు లేవు. దీంతో ఆలయ సొత్తు కాజేసేందుకు పూజారులను, సిబ్బందిని, కాంట్రాక్టర్లను ప్రోత్సహించిన అప్పటి 23 మంది కలెక్టర్లను విచారించేందుకు అనుమతివ్వాలని సీఐడీ కోరింది.
కలెక్టర్ల ప్రమేయం లేనిదే ఇంతపెద్ద మొత్తంలో ఆలయ సొత్తు కాజేసేందుకు వీలు లేదని సీఐడీ అభిప్రాయపడింది. తుల్జాభవానీ మాత మందిరం యాజమాన్యం యేటా గర్భగుడిలో ఉన్న హుండీని వేలం వేస్తుంది. హుండీలో ఉన్న నగదు వేలం పాట పాడినవారికి, బంగారు, వెండి, ముత్యాలు, రత్నాల అభరణాలు ఆలయానికి దక్కాలని ఒప్పందం ఉంది.
కాని పూజారులు, ఆలయ సిబ్బంది, కాంట్రాక్టర్లు కుమ్మక్కై హుండీలో పోగైన బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలను మాయం చేసినట్లు బట్టబయలైంది. ఆడిట్ తరువాత 348 పేజీల నివేదిక రూపొందించి పోలీసు కమిషనర్, సీఐడీకి అప్పగించారు. ఈ మొత్తాన్ని ఎవరి అండతో, ఎలా, ఎవరు కాజేశారో ఆరా తీస్తే అసలు విషయం బయటకు వస్తుందని పూజారుల కమిటీ అధ్యక్షుడు కిశోర్ రంగణే చెప్పారు.