శ్రీవారు.. మేటి శ్రీమంతుడు
* తిరుమలేశుని ఆస్తులు రూ. 2 లక్షల కోట్లకుపైనే
* ఏటేటా పెరుగుతున్న భక్తులు, కానుకలు, బడ్జెట్
* పెట్టుబడులు రూ. 10 వేల కోట్లకుపైనే
సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడు శ్రీవేంకటేశ్వరుడి సిరి సంపదలు యేటేటా పెరుగుతున్నాయి. ఘాట్ రోడ్లు ఏర్పడక ముందు వేలల్లో ఉండే ఆదాయం నేడు కోట్లకు చేరింది. శ్రీవారి స్థిరాస్తుల విలువ రూ. రెండు లక్షల కోట్లపైనే ఉంటుందని అంచనా.
హైకోర్టు ఆదేశాలతో లెక్కలు తీసిన టీటీడీ శ్రీవారి ఆస్తులు ఎంత? ఎక్కడెక్కడున్నాయి? వాటి వివరాలేమిటీ? అన్న విషయంలో దశాబ్దాలుగా విమర్శలున్నాయి. రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి స్థిరాస్తులను 2009లో టీటీడీ లెక్కలు తీసింది. ఈ మేరకు 4,143.67 ఎకరాల్లో భూములు, భవనాలు గుర్తించి ప్రభుత్వ ధర ప్రకారం కనీస ముఖ విలువ రూ. 33,447.74 కోట్లుగా నిర్ధారించారు. వాటికి సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 2 లక్షల కోట్ల కు పైబడే ఉంటుందని అంచనా.
రూ.10 వేల కోట్లు దాటిన శ్రీవారి పెట్టుబడులు
తిరుమల శ్రీవారికి పెట్టుబడుల(ఫిక్స్‌డ్ డిపాజిట్లు) రూపంలో బ్యాంకుల్లో రూ. 10వేల కోట్లకు పైబడి ఉన్నాయి. వీటిపై ఏడాదికి టీటీడీకి రూ. 744 కోట్ల మేరకు వడ్డీ రూపంలో వడ్డికాసులవాడి చెంతకు చేరుతోంది. రాబోవు రెండు మూడు ఏళ్లలోనే పెట్టుబడులపై వడ్డీ రూ. వెయ్యికోట్లు దాటే అవకాశముందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇక వివిధ ట్రస్టులకు భక్తులు ఇచ్చే విరాళాలు అదనం.
శ్రీవారి నిత్యాన్నప్రసాద ట్రస్టులో 2015 ఏప్రిల్ 5 నాటికి దాతలు ఇచ్చిన విరాళాలు రూ. 591 కోట్లకు చేరాయి. ప్రాణదాన ట్రస్టు కింద సుమారు రూ.200 కోట్లు, మిగిలిన ట్రస్టుల్లో మరో రూ. 300 కోట్లు ఉన్నాయి. ఇవిగాక రోజువారీగా భక్తుల నుంచి వచ్చే విరాళాలు ఏడాదికి సుమారు రూ. 100 కోట్లు వస్తుండడం గమనార్హం.
రూ. 2,530 వేల కోట్లకు పెరిగిన బడ్జెట్
1933 ప్రారంభంలో టీటీడీ బడ్జెట్ లక్షల్లో మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,530 కోట్లతో ధార్మిక బడ్జెట్ నిర్ణయించారు. ఇక స్వామిని దర్శించే భక్తులు ప్రతియేటా పెరుగుతున్నారు. 2010లో 2.14 కోట్ల మంది దర్శించుకోగా 2015 అర్థసంవత్సరానికి 1.5 కోట్ల మందికిపైగా తరలి వచ్చారు.