► పెరిగిన ట్రయల్ రన్ వేగం
► సంక్రాంతి నాటికి సేవలు
సాక్షి, చెన్నై: ఎగ్మూర్- కోయంబేడు మధ్య సొరంగ మార్గంలో మెట్రో సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మార్గంలో పనులు ముగిశాయి. ఇక, ట్రయిల్ రన్ వేగ వంతం చేసి, భద్రతా కమిషన్ పరిశోధనకు తగ్గ చర్యల్లో ఆ ప్రాజెక్టు వర్గాలు నిమగ్నమయ్యాయి. చెన్నైలో మెట్రో రైలు సేవలకు తగ్గ పనులు వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విమానాశ్రయం- ఆలందూరు- చిన్నమలై, కోయంబేడు- ఆలందూరు- సెయింట్ థామస్ మౌంట్ మార్గాల్లో పనులు ముగిసి రైలు సేవలకు శ్రీకారం చుట్టి ఉన్నారు. ఇక, చిన్న మలై నుంచి కూత వేటు దూరం వంతెన మీద తదుపరి పూర్తి స్థాయిలో సెంట్రల్ వరకు సొరంగ మార్గంలో రైలు పయనించేందుకు తగ్గ పనులు వేగవంతంగా సాగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వాషర్ మెన్ పేట నుంచి సెంట్రల్, ఎగ్మూర్‌ల మీదుగా కోయంబేడుకు సొరంగం మార్గం పనులు రెట్టింపు వేగంతో జరుగుతున్నాయి. ఎగ్మూర్ నుంచి నెహ్రూపార్క్, సొరంగ మార్గం రెడీ కీల్పాకం, పచ్చయప్ప కళాశాల, షెనాయ్ నగర్, అన్నానగర్, తిరుమంగళం మీదుగా కోయంబేడు వరకు ప్రస్తుతం సొరంగం మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఎగ్మూర్ నుంచి సెంట్రల్-వాషర్‌మన్ పేట వైపుగా ట్రాక్ ఏర్పాటు పనులు సాగాల్సి ఉంది. ఎగ్మూర్ నుంచి కోయంబేడు వరకు పనులు ముగియడంతో ఇక, సొరంగ మార్గం రైల్వేస్టేషన్లకు సొబగులు దిద్దేందుకు తగ్గ కార్యచరణతో మెట్రో ప్రాజెక్టు వర్గాలు ముందుకు సాగే పనిలో పడ్డాయి.ట్రాక్, విద్యుద్దీకరణ పనులు ముగియడంతో ఇక, ట్రయిల్ రన్ వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు.
ఈ రన్ పూర్తి స్థాయిలో విజయవంతం కాగానే, రైల్వే భద్రతా కమిషన్ వర్గాలు పరిశీలన, పరిశోధనానంతరం ప్రయాణికుల సేవకు శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను ముగించి కోయంబేడు - ఎగ్మూర్ మీదుగా సొరంగంలో ప్రయాణికులతో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు తగ్గ కార్యచరణతో ముందుకు సాగనున్నారు. ఈ పనులు ముగిసిన పక్షంలో సెయింట్‌థామస్ మౌంట్, విమానాశ్రయంల నుంచి ఆలందూరు మీదుగా కోయంబేడు వైపుగా ఎగ్మూర్ వరకు ఇక పయనం సాగించేందుకు వీలుంది. నగరంలో నలభై కి.మీ దూరం మేరకు చేపట్టిన మెట్రో రైలు పనుల్లో ఇప్పటి వరకు 90 శాతం ముగిసినట్టుగా ఆ ప్రాజెక్టు వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇక, వాషర్ మెన్ పేట నుంచి తిరువొత్తియూరు వరకు పనుల్ని పొడిగించిన దృష్ట్యా, పూర్తి స్థాయిలో సేవలకు మరో ఏడాది పట్టే అవకాశాలు ఉన్నాయి.
సొరంగ మార్గం రెడీ
Published Wed, Nov 2 2016 3:50 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement