
రాజధానిలో మరో ఘాతుకం
న్యూఢిల్లీ: ఇప్పటికే క్రైమ్ రేట్ లో అగ్రస్థానంలో ఉన్న దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణ హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. ప్యాసింజర్లుగా ట్యాక్సీ ఎక్కిన ఇద్దరు టీనేజర్లు డ్రైవర్ ను కాల్చిచంపిన ఘటన నైరుతి ఢిల్లీలోని నజఫ్ గఢ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను బట్టి..
కుల్ దీప్ అనే వ్యక్తి ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం ఇద్దరు టీనేజర్లు అతని కారులో ఎక్కారు. కారు ప్రయాణిస్తుండగానే ఆ ఇద్దరూ కుల్ దీప్ తో గొడవకుదిగారు. మాటామాట పెరగటంతో టీనేజర్లు తమ దగ్గరున్న తుపాకితో కుల్ దీప్ ను కాల్చి చంపి పారిపోయారు. గంట తర్వాతగానీ కారులో డ్రైవర్ హత్యకుగురై ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఉబెర్ టాక్సీ కస్టమర్ కాల్ డేటా ఆదారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.