‘ప్యాకేజీ’కి అప్పుడే ఒప్పుకున్నారా?
సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ధ్వజం
సాక్షి, రాజమహేంద్రవరం: ‘‘ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం వద్ద ఒప్పుకున్నారా?’’ అని సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టువల్ల ముంపు ప్రభావం పడే ఖమ్మంజిల్లాలోని ఏడు మండలాల్ని ఏపీలో విలీనం చేయకుంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోనని చెప్పిన బాబు అసలు ఆరోజు రాత్రి ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలన్నారు. ఉండవల్లి శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఏడు ముంపు మండలాలు, ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా, విద్యుత్ సంబంధిత అంశాలపై అప్పటి ప్రధాని మన్మోహన్ పార్లమెంట్‌లో ప్రకటన చేశారని గుర్తుచేశారు.
కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్ రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి పంపాక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో దానికి ఆమోదం పడలేదన్నారు. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా తొలగించి ముంపు మండలాల్ని ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ ఇచ్చిందన్నారు. ప్రత్యేక ప్యాకేజీకోసం ఆనాడే ఒప్పుకుంటే హోదా కోసం ఇప్పటివరకు నాటకాలాడాల్సిన అవసరమేంటన్నారు.2018కి పోలవరం, పురుషోత్తపట్నం పూర్తి చేస్తామని చంద్రబాబు చెబుతున్నారని, రెండూ ఒకే సమయానికి పూర్తయితే పురుషోత్తపట్నం ఎందుకని ఉండవల్లి ప్రశ్నించారు.పరిహారం కోరేవారిని, వారి తరఫున ప్రశ్నించే వైఎస్ జగన్‌ను అభివృద్ధి నిరోధకులంటున్న చంద్రబాబు వైఎస్ జలయజ్ఞంపై ఎన్నిసార్లు కోర్టులకెళ్లారో గుర్తు చేసుకోవాలన్నారు.