
కరుణానిధి భార్య ఇంట్లో కలకలం
చెన్నై: అన్నాడీఎంకే సంక్షోభంతో రాష్ట్రమంతా రాజకీయ చర్చోపచర్చలు జరుగుతుండగా డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి ఇంట్లోకి దుండగుడు చొరబడడం కలకలం రేపింది. కరుణానిధి భార్య రజతి అమ్మాల్ ఇంట్లోకి దొంగతనంగా చొరబడిన దుండగుడు ఆమెను తుపాకీతో బెదిరించాడు.
రంగంలోకి దిగిన మైలాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు ట్రిప్లేన్ ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ గా పోలీసులు గుర్తించారు. అతడు ఎందుకు ఇంట్లోకి ప్రవేశించాడనే కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేయడానికి చొరబడ్డాడా, మరేదైనా కారణం ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.