
న్యూహాంప్‌షైర్: అమెరికాలోని న్యూహాంప్‌షైర్ రాష్ట్ర రాజధాని కాంకార్డ్‌లోని సైకియాట్రిక్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు బలగాల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు.
కాల్పుల ఘటన ఆసుపత్రి లాబీ వరకే పరిమితం అయిందని, రోగులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నామన్నారు. తమ ట్రూపర్ జరిపిన కాల్పుల్లో అనుమానితుడు చనిపోయాడన్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. సుమారు 185 పడకలున్న న్యూహాంప్‌షైర్ సైకియాట్రిక్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ఏకైక ఆస్పత్రి.