ధనుష్ లేకుంటే నేను లేను
నా భర్త ధనుష్ సహకారం లేకుంటే దర్శకురాలనే హోదాలో నేనిక్కడుండేదాన్నే కాదు అన్నారు. వై రాజా వై చిత్ర దర్శకురాలు ఐశ్వర్యా ధనుష్. ‘3’ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈమె ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా దర్శకురాలిగా ఐశ్వర్యా ధనుష్ మాత్రం మంచి మార్కులే సంపాదించుకున్నారు. అలాంటి ఆమె మలి ప్రయత్నం వై రాజా వై. గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పలు విశేషాలు చోటు చేసుకున్నాయి.
నటి తాప్సీ అతిథి పాత్రలో నటించడం, దర్శక నటుడు ఎస్‌జే సూర్య సింగిల్ సాంగ్ చేయడం, దర్శకుడు వసంత్ తొలిసారిగా నటుడిగా పరిచయం అవడం వంటి విశేషాలతో పాటు ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన వై రాజా వై చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్త విడుదల చేయడం ఇలా చాలా అంశాలు కొత్తగా ఉంటాయి. అలాగే నటుడు ధనుష్ ఒక క్యామియో పాత్ర పోషించారు కూడా. యువన్ శంకర్ రాజా సంగీతబాణీలందించిన ఈ చిత్రం మే ఒకటవ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకురాలు ఐశ్వర్యా ధనుష్ మాట్లాడుతూ తానీ చిత్రం చేయడానికి అర్చన ఏజీఎస్‌నే కారణం అన్నారు.
ఒకసారి ఆమె ఫోన్ చేసి తదుపరి ప్రాజెక్ట్ ఏమిటని అడిగారన్నారు. ప్రస్తుతం ఏమీ అనుకోలేదు. అయితే ఒక నోట్ మాత్రం ఉందని చెప్పానన్నారు. అలా ఈ వై రాజా వై చిత్ర నిర్మాణానికి బీజం పడిందని వివరించారు. ఈ చిత్రానికి కరెక్ట్ ఆర్టిస్టులు సమకూరారని చెప్పారు. అంతేకాకుండా ఎస్‌జే సూర్య, వసంత్, మనోబాల ముగ్గురు దర్శకులు ఈ చిత్రంలో నటించడం విశేషం అన్నారు. వేల్‌రాజా చాయాగ్రహణ, యువన్ శంకర్ రాజా సంగీతం అంటూ చాలా స్ట్రాంగ్ యూనిట్ పని చేశారన్నారు. వీరందరికి తాను చెప్పిందొక్కటే. తన తొలి చిత్రం ‘3’ ని చూసి రావద్దు. వై రాజా వై అడ్వెంచర్ కథా చిత్రం అని చెప్పానని అన్నారు.
ధనుష్ ప్రోత్సాహం
అందరూ రజనీకాంత్, ధనుష్ చిత్రం చూశారా? వారు ఎలా ఫీలయ్యారు. అని అడుగుతున్నారని తానిక్కడ విషయం ప్రస్తావించదలచుకున్నానన్నా రు. తన భర్త ధనుష్ ప్రోత్సాహం లేకుంటే దర్శకురాలిగా తానిక్కడ నిలబడేదాన్ని కాదన్నారు. తన తొలి చిత్ర హీరోగా అయ్యారని గుర్తు చేశారు. ఈ చిత్రం లోను ధనుష్ అతిథి పాత్రలో నటించారని తెలిపారు. ఇకపోతే తన తండ్రి రజని, భర్త ధనుష్ వై రాజా వై చిత్రం చూశారు. వారికి చిత్రం బాగా నచ్చిందని చెప్పారు.
చిత్ర ఆలస్యానికి నేనే కారణం
వై రాజా వై చిత్ర నిర్మాణంలో జాప్యానికి కారణం ఏమిటని అడుగుతున్నారని, దానికి తానే బాధ్యత వహిస్తానని ఐశ్వర్య ధనుష్ అన్నారు. అయితే ఆలస్యం అయినా ఆ సమయంలో చాలా మంచి విషయాలు జరిగాయని అన్నారు. చిత్ర షూటింగ్‌ను గోవా, సింగపూర్, బ్యాంకాంక్‌లలో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ధనుష్ నటించిన అనేగన్ చిత్రం కూడా వై రాజా వై చిత్ర ఆలస్యానికి ఒక కారణం అన్నారు. అనేగన్ విడుదల తరువాత వై రాజా వై విడుదల చేయాలని నిర్మాతలు భావించారని తెలిపారు.