Vai Raja Vai
-
వారిద్దరితో సినిమా తీసే ఆలోచన లేదు
చెన్నై: తన తండ్రి రజనీకాంత్, భర్త ధనుష్ కలసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ సౌందర్య ధనుష్ వెల్లడించారు. గురువారం చెన్నైలో సౌందర్య మాట్లాడుతూ.... మీ దర్శకత్వంలో రజనీకాంత్, ధనుష్ కలసి నటిస్తున్న చిత్రం ఎప్పడు ప్రారంభమవుతుందని ప్జజలు నిత్యం తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పారు. అయితే అలాంటి ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఏమీ ప్రస్తుతానికి తన వద్ద లేదని చెప్పారు. ధనుష్ నటించిన వాయి రాజా వాయి చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని సౌందర్య అన్నారు. వాయి రాజా వాయి చిత్రంలో గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వాయి రాజా వాయి చిత్రానికి సౌందర్య ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
ధనుష్ లేకుంటే నేను లేను
నా భర్త ధనుష్ సహకారం లేకుంటే దర్శకురాలనే హోదాలో నేనిక్కడుండేదాన్నే కాదు అన్నారు. వై రాజా వై చిత్ర దర్శకురాలు ఐశ్వర్యా ధనుష్. ‘3’ చిత్రంతో మెగాఫోన్ పట్టిన ఈమె ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందినా దర్శకురాలిగా ఐశ్వర్యా ధనుష్ మాత్రం మంచి మార్కులే సంపాదించుకున్నారు. అలాంటి ఆమె మలి ప్రయత్నం వై రాజా వై. గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పలు విశేషాలు చోటు చేసుకున్నాయి. నటి తాప్సీ అతిథి పాత్రలో నటించడం, దర్శక నటుడు ఎస్జే సూర్య సింగిల్ సాంగ్ చేయడం, దర్శకుడు వసంత్ తొలిసారిగా నటుడిగా పరిచయం అవడం వంటి విశేషాలతో పాటు ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన వై రాజా వై చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్త విడుదల చేయడం ఇలా చాలా అంశాలు కొత్తగా ఉంటాయి. అలాగే నటుడు ధనుష్ ఒక క్యామియో పాత్ర పోషించారు కూడా. యువన్ శంకర్ రాజా సంగీతబాణీలందించిన ఈ చిత్రం మే ఒకటవ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకురాలు ఐశ్వర్యా ధనుష్ మాట్లాడుతూ తానీ చిత్రం చేయడానికి అర్చన ఏజీఎస్నే కారణం అన్నారు. ఒకసారి ఆమె ఫోన్ చేసి తదుపరి ప్రాజెక్ట్ ఏమిటని అడిగారన్నారు. ప్రస్తుతం ఏమీ అనుకోలేదు. అయితే ఒక నోట్ మాత్రం ఉందని చెప్పానన్నారు. అలా ఈ వై రాజా వై చిత్ర నిర్మాణానికి బీజం పడిందని వివరించారు. ఈ చిత్రానికి కరెక్ట్ ఆర్టిస్టులు సమకూరారని చెప్పారు. అంతేకాకుండా ఎస్జే సూర్య, వసంత్, మనోబాల ముగ్గురు దర్శకులు ఈ చిత్రంలో నటించడం విశేషం అన్నారు. వేల్‌రాజా చాయాగ్రహణ, యువన్ శంకర్ రాజా సంగీతం అంటూ చాలా స్ట్రాంగ్ యూనిట్ పని చేశారన్నారు. వీరందరికి తాను చెప్పిందొక్కటే. తన తొలి చిత్రం ‘3’ ని చూసి రావద్దు. వై రాజా వై అడ్వెంచర్ కథా చిత్రం అని చెప్పానని అన్నారు. ధనుష్ ప్రోత్సాహం అందరూ రజనీకాంత్, ధనుష్ చిత్రం చూశారా? వారు ఎలా ఫీలయ్యారు. అని అడుగుతున్నారని తానిక్కడ విషయం ప్రస్తావించదలచుకున్నానన్నా రు. తన భర్త ధనుష్ ప్రోత్సాహం లేకుంటే దర్శకురాలిగా తానిక్కడ నిలబడేదాన్ని కాదన్నారు. తన తొలి చిత్ర హీరోగా అయ్యారని గుర్తు చేశారు. ఈ చిత్రం లోను ధనుష్ అతిథి పాత్రలో నటించారని తెలిపారు. ఇకపోతే తన తండ్రి రజని, భర్త ధనుష్ వై రాజా వై చిత్రం చూశారు. వారికి చిత్రం బాగా నచ్చిందని చెప్పారు. చిత్ర ఆలస్యానికి నేనే కారణం వై రాజా వై చిత్ర నిర్మాణంలో జాప్యానికి కారణం ఏమిటని అడుగుతున్నారని, దానికి తానే బాధ్యత వహిస్తానని ఐశ్వర్య ధనుష్ అన్నారు. అయితే ఆలస్యం అయినా ఆ సమయంలో చాలా మంచి విషయాలు జరిగాయని అన్నారు. చిత్ర షూటింగ్‌ను గోవా, సింగపూర్, బ్యాంకాంక్లలో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ధనుష్ నటించిన అనేగన్ చిత్రం కూడా వై రాజా వై చిత్ర ఆలస్యానికి ఒక కారణం అన్నారు. అనేగన్ విడుదల తరువాత వై రాజా వై విడుదల చేయాలని నిర్మాతలు భావించారని తెలిపారు. -
కమల్‌తో ఐశ్వర్యా ధనుష్ ఢీ
కమలహాసన్‌తో నటుడు ధనుష్ భార్య ఐశ్వర్యా ఢీ కొంటున్నారు. సాధారణంగా ఒక భారీ చిత్రం విడుదలవుతుందంటే చిన్న చిత్రాలను ఆ సమయంలో విడుదల చేయడానికి ఆలోచిస్తారు. అయితే గత శుక్రవారం మణిరత్నం చిత్రం ఓ కాదల్ కణ్మణి, లారెన్స్ చిత్రం కాంచన -2 చిత్రాలు ఒకేరోజు తెరపైకి వచ్చి ప్రేక్షకాదరణతో విజయబాటలో పయనిస్తున్నాయి. తాజగా విశ్వనాయకుడు కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రం ఐశ్వర్యా ధనుష్ దర్శకత్వం వహించిన వై రాజా వై చిత్రాలు ఒకే రోజు తెరపైకి రానున్నాయి. ఉత్తమవిలన్: విశ్వరూపం వంటి విజ యవంతమైన చిత్రం తరువాత కమలహాసన్ నటించిన ఉత్తమ విలన్ మేనె ల ఒకటో తారీఖున విడుదల కానుంది. కమల్ సరసన పూజాకుమార్, ఆండ్రి య, ఊర్వశి, పార్వతినాయర్, పార్వతి మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి నటుడు రమేష్ అరవింద్ దర్శకుడు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి సమర్పణలో ఆయ న సోదరుడు సుభాష్ చంద్రబోస్ నిర్మిం చిన భారీ చిత్రం ఉత్తమవిలన్. దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం 18వ శతాబ్దం ప్రస్తుత కాలానికి చెందిన సంఘటనలతో కూడిన నాటక, సినీ కళాకారుల ఇతివృత్తంగా రూపొం దించిన చిత్రం ఉత్తమవిలన్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వై రాజా వై : 3 వంటి సంచలన ప్రేమ కథా చిత్రాల ద్వారా దర్శకురాలిగా పరి చయమైన ఐశ్వర్యా ధనుష్ ఆ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకున్న అందులోని వై దిస్ కొలవెరి పాట అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఆ విధంగా బహుళ ప్రచారం పొందిన చిత్రం 3. తరువాత ఐశ్వర్య ధనుష్ తెరకెక్కించిన చిత్రం వై రాజా వై. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఉత్తమవిలన్ విడుదలవుతున్న రోజునే విడుదల చేయడానికి చిత్ర దర్శక నిర్మాతలు సిద్ధమయ్యారు. మరి ఈ చిత్రాల మధ్య పోటీ తెలియాలంటే మరో పదిరోజులు ఆగాల్సిందే. -
ప్రియాఆనంద్ అంటేనే..
సక్సెస్ వచ్చినప్పుడు మోసేయడం, ప్లాప్‌లు వచ్చినప్పుడు ముఖం చాటేయడం సినిమా పరిశ్రమలో మామూలు విషయమే. ఇందుకు తారలేమీ అతీతం కాదు. విజయం వస్తే పారితోషికాలు పెంచేయడం, లేకుంటే అవకాశాల కోసం వెంట పడడం సర్వసాధారణం. ఆ మధ్య వరుసగా రెండు విజయాలు దక్కడంతో నటి ప్రియాఆనంద్ తల ఎగరేసింది. ఆ తరువాత ఇరుంబుకుదిరై, ఒరు ఊర్ల రెండు రాజా చిత్రాలు నిరాశపరచడంతో తదుపరి అవకాశాలు సుదూరతీరంలో కనిపించడం లేదు. తొలుత అందాలు విచ్చలవిడిగా ఆరబోసిన ప్రియా ఆనంద్ అలాగే కొనసాగితే కొంత కాలంలోనే మార్కెట్ క్లోజ్ అవుతుందన్న హితుల సలహాతో గ్లామర్ మోతాదును తగ్గించారట. అయినా జరగాల్సిందేదో జరిగిపోయిందన్న సామెతలా ప్రియా ఆనంద్‌కు ప్రస్తుతం నటిస్తున్న వై రాజా వై చిత్రం మినహా వేరే చిత్రం లేదు. ఈ చిత్రంపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు ధనుష్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఆయన అర్ధాంగి ఐశ్వర్యనే చిత్రానికి కెప్టెన్. కాగా ప్రియా ఆనంద్‌కు అవకాశాలు వెనుకాడటానికి కారణం ఆమె స్వయం కృపారాధమే అంటున్నారు కోలీవుడ్ వర్గా లు. తల బిరుసుగా మాట్లాడడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి ప్రవర్తనే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ప్రియా ఆనంద్ మాత్రం వై రాజా వై చిత్రం విడుదల తరువాత కూడా అవకాశాలు రాకపోతే ఇతర భాషా చిత్రాలైన తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలపై దృష్టి సారించాలని చూస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గం చెబుతోంది. -
అలా చేయడం ఆనందమే
మా ఆయన్ని డెరైక్ట్ చేసినప్పుడు చాలా ఆనందం కలిగిందంటున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్య. ఈమె తొలిసారిగా మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘3’. ధనుష్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అంతగా విజయం సాధించకపోయినా ఆ చిత్రంలో సంగీత దర్శకుడు అనిరుధ్ బాణీలు కట్టిన వై దిస్ కొలెవైరి డీ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. ఐశ్వర్య ధనుష్ మలి ప్రయత్నం వై రాజా వై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగాను ప్రియా ఆనంద్ హీరోయిన్‌గాను నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇటీవలే మార్కెట్లోకి విడుదలయ్యాయి. వినోద భరిత చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ మాట్లాడుతూ తాను తొలి చిత్రం దర్శకత్వం వహించినప్పుడు అధిక శ్రద్ధ చూపించలేదన్నారు. దీంతో తదుపరి చిత్రానికి కొత్త ప్రయోగం చేయాలని భావించానన్నారు. తాను, తన భర్త చిత్రాల పనిలో బిజీగా ఉండడంవలన ఇంటిలో మాట్లాడుకోవడానికి చాలా తక్కువ సమయమే ఉంటుందన్నారు. అయినా నా చిత్ర కథ ధనుష్‌కు తెలుసని తెలిపారు. ధనుష్ తన కంటే సీనియర్ అని అంతేకాకుండా తనకు మార్గదర్శకుడు కూడా అని అన్నారు. తనకాయన చాలా సాయం చేస్తారని వై రాజా వై చిత్రంలో కూడా అతిథి పాత్రలో నటించారని ఆయన్ని దర్శకత్వం వహించడం చాలా ఆనందం కలిగించిందని ఐశ్వర్య ధనుష్ పేర్కొన్నారు. -
ఐశ్వర్యలో అదే నచ్చింది
ఐశ్వర్య ధనుష్‌లోని ఆత్మవిశ్వాసం నచ్చిందని ప్రముఖ దర్శకుడు బాలా ప్రశంసించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ భార్య ఐశ్వర్య, మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంగా 3 అనే సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్య వై రాజా వై అంటున్నారు. యువ నటుడు గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో తాప్సీ ఒక ముఖ్య భూమికను పోషించడం విశేషం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం కోసం నటుడు ధనుష్ ఒక పాట రాసి పాడటం మరో విశేషం. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ బుధవారం జరిగింది. దర్శకుడు బాలా మాట్లాడుతూ ఐశ్వర్య పట్టుదల, శ్రమకు తగ్గ ఫలితా న్ని ఈ చిత్రం ఇస్తుందన్నారు. ధనుష్, లతా రజనీకాంత్, కెవి ఆనంద్, గౌతమ్ కార్తీక్, తాప్సీ, ప్రియా ఆనంద్, ఎస్‌జె సూర్య, కస్తూరిరాజా, అనిరుధ్, మనోబాల పాల్గొన్నారు. -
గెస్ట్ రోల్లో తాప్సీ
తొలిసారిగా 3 చిత్రంతో మెగాఫోన్ పట్టి వై దిస్ కొలెవైరి పాటతో బహుళ ప్రాచుర్యం పొందిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్. ఈమె సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురన్న విషయం తెలిసిందే. 3 చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా తాజాగా విజయమే లక్ష్యంగా చాలా కసిగా తెరకెక్కిస్తున్న చిత్రం వై రాజావై యువక్రేజీ నటుడు గౌతమ్ కార్తిక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాఆనంద్ హీరోయిన్గా నటిస్తున్నారు. నటి తాప్సీ ఇప్పుడు అదనంగా వచ్చి చేరారు. ఇందులో ఈ బ్యూటీ అతిథి పాత్రను చేస్తున్నారట. దీని గురించి తాప్సీ మాట్లాడుతూ తానిప్పటి వరకు అతిథి పాత్రలో నటించింది లేదన్నారు. అయితే దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌తో ఉన్న స్నేహం కారణంగా ఈ చిత్రంలో నటించడానికి ముందు అంగీకరించినా కాస్త సందేహంతోనే కథ విన్నానన్నారు. అయితే ఐశ్వర్య కథ నెరేట్ చేసిన తరువాత నో అని చెప్పలేకపోయానన్నారు. అంతగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని తాప్సీ తెలిపారు. -
ఊహకు అందని పాత్రలో...
గ్లామర్‌ని కాసేపు పక్కన పెట్టేసి ఆర్టిస్టుగా తనేంటో నిరూపించుకునే పనిలో పడ్డారు తాప్సీ. ‘ఆరంభం’తో తమిళంలో కూడా హిట్ కొట్టేసి, అక్కడ కూడా విరివిగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారీమె. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గంగ’ చిత్రంలో తాప్సీ నటిస్తున్న చిత్రం తెలిసిందే. ఈ సినిమాలో కూడా అభినయానికి ఆస్కారమున్న పాత్రనే పోషిస్తున్నారు తాప్సీ. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి తాప్సీ పచ్చజెండా ఊపేశారు. ‘3’ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ప్రశంసలందుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ఓ స్పెషల్ రోల్ పోషించనున్నారు. తాప్సీ కెరీర్లోనే గుర్తుంచుకోదగ్గదిగా ఈ పాత్ర ఉంటుందని సమాచారం. ‘‘ ‘వై రాజా వై’లో భిన్నమైన పాత్ర చేయబోతున్నాను. ఆడియన్స్ ఊహలకు అందని స్థాయిలో ఇందులో నా పాత్ర ఉంటుంది. ఈ అవకాశాన్నిచ్చిన దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌కి థ్యాంక్స్’ అని ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వెలిబుచ్చారు తాప్సీ. యువన్‌శంకర్‌రాజా స్వరాలందిస్తున్న ఈ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.