ప్రియాఆనంద్ అంటేనే..
సక్సెస్ వచ్చినప్పుడు మోసేయడం, ప్లాప్‌లు వచ్చినప్పుడు ముఖం చాటేయడం సినిమా పరిశ్రమలో మామూలు విషయమే. ఇందుకు తారలేమీ అతీతం కాదు. విజయం వస్తే పారితోషికాలు పెంచేయడం, లేకుంటే అవకాశాల కోసం వెంట పడడం సర్వసాధారణం. ఆ మధ్య వరుసగా రెండు విజయాలు దక్కడంతో నటి ప్రియాఆనంద్ తల ఎగరేసింది. ఆ తరువాత ఇరుంబుకుదిరై, ఒరు ఊర్ల రెండు రాజా చిత్రాలు నిరాశపరచడంతో తదుపరి అవకాశాలు సుదూరతీరంలో కనిపించడం లేదు.
తొలుత అందాలు విచ్చలవిడిగా ఆరబోసిన ప్రియా ఆనంద్ అలాగే కొనసాగితే కొంత కాలంలోనే మార్కెట్ క్లోజ్ అవుతుందన్న హితుల సలహాతో గ్లామర్ మోతాదును తగ్గించారట. అయినా జరగాల్సిందేదో జరిగిపోయిందన్న సామెతలా ప్రియా ఆనంద్‌కు ప్రస్తుతం నటిస్తున్న వై రాజా వై చిత్రం మినహా వేరే చిత్రం లేదు. ఈ చిత్రంపైనే ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. యువ నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు ధనుష్ అతిథి పాత్రలో నటిస్తున్నారు.
ఆయన అర్ధాంగి ఐశ్వర్యనే చిత్రానికి కెప్టెన్. కాగా ప్రియా ఆనంద్‌కు అవకాశాలు వెనుకాడటానికి కారణం ఆమె స్వయం కృపారాధమే అంటున్నారు కోలీవుడ్ వర్గా లు. తల బిరుసుగా మాట్లాడడం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి ప్రవర్తనే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ప్రియా ఆనంద్ మాత్రం వై రాజా వై చిత్రం విడుదల తరువాత కూడా అవకాశాలు రాకపోతే ఇతర భాషా చిత్రాలైన తెలుగు, కన్నడం, మలయాళం చిత్రాలపై దృష్టి సారించాలని చూస్తున్నట్లు ఆమె సన్నిహిత వర్గం చెబుతోంది.