
బాలా నుంచి బహుమతులు
దర్శకుడు బాలా నటి వరలక్ష్మికి బహుమతుల వర్షం కురిపిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ నటించిన తొలి చిత్రం పోడాపొడి విడుదలైనా ఆమెకు పెద్ద నిరాశనే మిగిల్చింది. మలి చిత్రం మదగజరాజ చాలా కాలంగా విడుదలకు నోచుకోవడం లేదు. ఈ సమయంలో వరలక్ష్మికి తాను చేయూతనిస్తానంటూ దర్శకుడు బాలా ముందుకొచ్చారు. శశికుమార్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న తారై తప్పట్టై చిత్రంలో నాయకిగా అవకాశం ఇచ్చారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న 1000వ చిత్రం అనే రికార్డును సొంతం చేసుకోనున్న చిత్రం ఇది.
పస్తుతం ఈ చిత్రం తంజావూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం కోసం వరలక్ష్మి గరగాట్టం నృత్యం నేర్చుకోవడం విశేషం. ఇందులో ఆమె ప్రతి నాయకులతో పోరాడే సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటాయట. ఈ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరిస్తుండగా మెడ భాగంలోని ఎముకకు బలమైన దెబ్బ తగిలి ఇబ్బంది పడ్డారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌కు తెలిస్తే షూటింగ్‌కు అంతరాయం కలుగుతుందని, నొప్పిని ఓర్చుకుంటూ నటించారట. సాయంత్రం షూటింగ్ ప్యాకప్ అయిన తరువాత ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారట. ఈ విషయం యూనిట్ వర్గాల ద్వారా తెలుసుకున్న దర్శకుడు బాలా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారట.
తారై తప్పట్టై చిత్రంలో వరలక్ష్మి నటనకు జాతీయ అవార్డు రావడం ఖాయం అని పేర్కొనడంతో పాటు వెంటనే ఆమెకు లక్ష రూపాయల విలువైన బంగారు గొలుసును బహుమతిగా అందించారట. అంతేకాదు తన తదుపరి చిత్రంలో హీరోయిన్ అవకాశం ఇచ్చేశారట. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించికపోయినా కథ, కథనం, సంభాషణలు అందించి సొంతంగా నిర్మించనున్నారట. అలా జాతీయ ఉత్తమ దర్శకుడు బాలా నుంచి అభినందనలు, బహుమతులు, అవకాశాలు అందుకుని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారట నటి వరలక్ష్మి.