సాక్షి, ముంబై: వివిధ ప్రాంతాల నుంచి రావల్సిన కూర గాయలు 30 శాతం తగ్గిపోవడంతో ముంబైసహా ఠాణే, నవీ ముంబైలో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. మొన్నటి వరకు గృహిణులకు కొంత ఊరట కల్గించిన కూరగాయల ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. నగరంతోపాటు ఠాణే, నవీముంబైకి నిత్యం నాసిక్, గుజరాత్, పుణే, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు వస్తుంటాయి. గత రెండు వారాలుగా వాటి దిగుమతి 30 శాతం మేర తగ్గిపోవడంతో క్యాబేజీ, ఫ్లవర్ మినహా మిగత కూరగాయల కొరత ఏర్పడింది. ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం ఈ మాసంలో ఉపవాసాలు కొనసాగుతున్నాయి.
ఈ మాసంలో అనేక మంది మాంసాహారాలకు దూరంగా ఉంటారు. ఈ కారణంగా ఒక్కసారిగా కూరగాయలకు మరింత డిమాండ్ పెరిగి పోయింది. ఇదే సందర్భంలో కూరగాయల కొరత ఏర్పడడం హోల్ సెల్ వ్యాపారులకు కలిసొచ్చింది. రైతులు రూపాయి పెంచితే ఇక్కడ వ్యాపారులు ఏకంగా ఐదు రూపాయలు పెంచేసి అందినంత దండుకుంటున్నారు. సాధారణంగా ఏటా శీతాకాలంలో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ప్రాంగణం కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ శీతాకాలంలో వాహనాల సందడి అంతగా కనిపించడం లేదని ఏపీఎంసీ మాజీ డెరైక్టర్ శంకర్ పింగళే అన్నారు.
సాధారణంగా ఎపీఎంసీలోకి రోజు కూరగాయల లోడుతో సుమారు 450-475 వరకు ట్రక్కులు, టెంపోలు వస్తుంటాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 100-150 వరకు తగ్గిపోయింది. ఫలితంగా సరుకు నిల్వలు తగ్గిపోవడంతో కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయని వ్యాపారి గోపినాథ్ మాల్సురే అన్నారు. విదర్భ, మరఠ్వాడాలో ఏర్పడిన కరువు ప్రభావం కూడా కూరగాయల దిగుబడులపై చూపుతున్నాయి. అక్కడి నుంచి నగరానికి రావల్సిన సరుకు ఇప్పటికే నిలిచిపోయింది. దీనికి తోడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కావాల్సిన కూరగాయలు 30 శాతం తగ్గిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీని ప్రభావం గహిణీల ఆర్థిక బడ్జెట్‌పై పడుతోంది.
మండుతున్న కూరగాయల ధరలు
Published Tue, Dec 2 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 5:28 PM
Advertisement
Advertisement