మదన్‌ను కోర్టులో హాజరుపరచండి
చెన్నై నగర పోలీసు కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం
తమిళసినిమా: వేందర్ మూవీస్ మదన్ ఆచూకీ కనిపెట్టి అతన్ని కోర్టులో హాజరుపరచాలని చెన్నై హైకోర్టు నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. మదన్ ఇటీవల ఐదు పేజీల లేఖను మీడియాకు విడుదల చేసి అదృశ్యం అయిన విషయం తెలిసిందే. అందులో తాను కాశీలో తనువు చాలిస్తానని పేర్కొన్నారు. ఆయన అదృశ్యం అయినప్పటి నుంచి లేఖలోని అంశాలు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీటు కోసం ఫీజులు చెల్లించిన వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
మరోపక్క మదన్ భార్యలిద్దరూ తమ భర్త ఆచూకీ కనుగొని తమకు అప్పగించాల్సిందిగా పోలీస్ క మిషనర్‌ను కోరారు. దీంతో పోలీసులు మదన్ కోసం గాలింపు చర్యలు తీవ్రం చేశారు. తాజాగా మదన్ తల్లి చెన్నై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చే సింది. తన కొడుకు గత నెల 29న ఇల్లు విడిచి వెళ్లిపోయారని, అప్పటి నుంచి తన గురించి ఎవరికీ తెలియలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొంది. తన కొడుకు ఆచూకీ కనుగొని తమకు అప్పగించాల్సిందిగా పోలీస్ క మిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తన కొడుకు ఆచూకి కనుగొనలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి తన కొడుకు ఆచూకి కనిపెట్టి తమకు అప్పజెప్పాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తులు నాగముత్తు,భారతీదాసన్‌ల సమక్షంలో విచారణకు వచ్చింది. పిటీషన్‌ను విచారించిన న్యాయమూర్తులు ఈ నెల 8వ తేదీ లోపు మదన్ ఆచూకీ కనుగొని కోర్టులో హాజరు పరచాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా దీనిపై పీఎంకే నేత రామదాస్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో సీటు కోసం డబ్బు చెల్లించిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆయన అందులో పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని విశ్వవిద్యాలయం గుర్తింపును రద్దు చేయాలని, వెంటనే ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని అందులో రామదాస్ విడుదల చేశారు. దీంతో మదన్ అదృశ్యం వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.