అలనాటి నటి రాధా కన్నుమూత
♦ అనారోగ్యంతో ఆస్పత్రిలో మృతి
♦ ప్రముఖుల సంతాపం
బనశంకరి : బహుభాషా నటి బీవీ రాధా (70) ఆదివారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందారు. గత కొద్ది కాలంగా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆమె ఇటీవల కోలుకున్నారు. శనివారం హొరమావులోని నివాసంలో మరోసారి అస్వస్తతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. అభిమానులు, సినీ ప్రముఖులు, నటులు చివరిసారిగా ఆమె పార్థీవ దేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రాధా చివరి కోరిక మేరకు ఆమె మృతదేహాన్ని ఎంఎస్ రామయ్య ఆస్పత్రికి దానం చేయాలని నిర్ణయించారు. డాక్టర్ రాజ్‌కుమార్‌తో నవకోటి నారాయణ చిత్రం ద్వారా బీవీ.రాధా కన్నడ చిత్ర రంగానికి పరిచయమన్నారు.
తెలుగు, తమిళం, మలయాళం, తులు, హిందీ భాషల్లో 500 పైగా చిత్రాల్లో ఆమె నటించారు. ఇందులో 250కిపైగా చిత్రాల్లో కన్నడలో నటించారు. ఆమె భర్త డైరెక్టర్ కేఎస్‌ఎల్ రవి రెండేళ్ల క్రితం మృతి చెందిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటున్నారు. 1964లో సినీరంగంలో అడుగుపెట్టిన రాధా అప్పటి సూపర్‌స్టార్లు డాక్టర్ రాజ్‌కుమార్, ఎంజీ.రామచంద్రన్, శివాజీగణేశన్, ఎన్‌టీ.రామారావ్, జెమిని గణేశన్, అక్కినేని నాగేశ్వరరావు, జైశంకర్ తదితర నటులతో నటించారు.
ప్రముఖలు సంతాపం : నటి రాధా మృతిపై సీఎం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మంచి నటిగా బహుభాషా చిత్రాల్లో గుర్తింపు పొందిన రాధా మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటన్నారు. కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు సారా.గోవిందుతో పాటు పలువురు నటులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.