28 ఏళ్ల చీకటికి సెలవ్
తమిళనాడులో సంగీత దర్శకుడు గణేశ్‌కు మళ్లీ చూపు
అన్నానగర్ (చెన్నై), న్యూస్‌లైన్: ఎన్నో దక్షిణాది సినిమాలకు సంగీతాన్నందించిన శంకర్-గణేశ్ ద్వయంలో ఒకరైన గణేశ్ జీవితంలో ఓ అద్భుతం జరిగింది. 28 ఏళ్ల కిందట బాంబు పేలుడులో చూపు కోల్పోయిన ఆయన చెన్నైకు చెందిన ప్రముఖ నేత్ర నిపుణుడైన డాక్టర్ అగర్వాల్ చేసిన అత్యాధునిక శస్త్రచికిత్సతో ఇప్పుడు మళ్లీ చూడగలుగుతున్నారు. 1986లో అభిమాని పేరుతో వచ్చిన పార్సిల్ బాక్సును గణేశ్ తెరుస్తుండగా అందులోని బాంబు పేలింది. దీంతో గణేశ్ ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. రెండో కన్ను పాక్షికంగా కనిపించేది. నాటి నుంచి ఆయన సంగీతానికి దూరంగా ఉంటూ వచ్చారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ అగర్వాల్ మూడు వారాల క్రితం గణేశ్ కళ్లకు శస్త్ర చికిత్స చేశారు. శనివారం అగర్వాల్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో విలేకరుల సమావేశంలో గణేశ్ మాట్లాడుతూ.. ఉద్వేగానికి లోనయ్యారు. డాక్టర్ అగర్వాల్ దృష్టి దాత అని ప్రశంసలు గుప్పించారు. అప్పటికప్పుడు ఆయన ‘దానం సేవో... కన్నె దానం సేవో’ అన్న పాటను కట్టి దానిని అగర్వాల్‌కు అంకితమిచ్చారు. 28 ఏళ్ల పాటు తాను ఏక నేత్ర అంధత్వంతో బాధపడ్డానన్నారు. నేడు కళ్లజోడు లేకుండానే అన్నీ చదవగలుగుతున్నట్లు తెలిపారు.
ఐవోఎల్ కటకం పెట్టాను: అగర్వాల్
‘‘బాంబు పేలిన సంఘటనలో గణేశ్ కంటిలోని కార్నియా పొర దెబ్బతింది. ఎక్కువ మొత్తంలో దుమ్ము, ధూళి కార్నియా పొరను చీల్చుకొని లోపల ఉన్న కటకాన్ని (లెన్స్‌ను) ఛిద్రం చేశాయి. దీంతో ఆయన దృష్టిని కోల్పోయారు. రెండు కళ్లల్లోకి చేరిన బాంబు శకలాలను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా శుభ్రం చేశాం. అనంతరం ఐవోఎల్ (ఇంట్రా ఆక్యులర్ లెన్స్) కటకాన్ని ఫైబ్రిన్ గ్లూ ద్వారా అతికించి గణేశ్‌కు స్పష్టమైన దృష్టిని ఇచ్చాం. శస్త్ర చికిత్సకు ముందు గణేశ్ ఒక కంటితో మాత్రమే చూడగలిగేవారు. రంగులు ఆయనకు మసకగా కన్పించేవి. ఆపరేషన్ తర్వాత గణేశ్ పూర్తిగా పూర్ణమైన, స్పష్టమైన దృష్టిని పొందారు’’ అని డాక్టర్ అగర్వాల్ విలేకరుల సమావేశంలో వివరించారు.