సాక్షి, ముంబై: చెదురుమదురు సంఘటనలు మినహా విదర్భలోని పది లోక్‌సభ స్థానాలకు జరిగిన తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల కాల్పులు, ఈవీఎంల మొరాయింపు, స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నా పోలింగ్ సజావుగానే ముగిసింది. జిల్లాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సుమారు 62.36 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
అందిన వివరాల మేరకు...గడ్చిరోలి, అకోలా, అమరావతి, భండారా-గోండియాలో 65 శాతం, వర్ధాలో 61, రాంటెక్ 62, నాగపూర్ 59, చంద్రపూర్ 63, యావత్మల్-వాషీలో 60 శాతం, బుల్డానాలో 58.66 శాతం ఓటింగ్ నమోదైంది. భండారా-గోండియా, బుల్డానా మినహా మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లో పొలింగ్ ఒకటి నుంచి పదిహేను శాతానికి పెరిగింది. 2009 ఎన్నికల్లో 49 శాతం ఓటింగ్ నమోదైన అకోలాలో ఈసారి ఏకంగా 65 శాతానికి పెరిగింది. గత ఎన్నికల్లో 43.4 శాతం ఓటింగ్ నమోదైన నాగపూర్‌లో ఈసారి సుమారు 59 శాతం పెరిగింది.
ఉత్సహంగా ఓటేసిన ప్రజలు...
తొలి దశలో పోటీ చేస్తున్న 201 మంది అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లో నిక్షిప్తమైంది. మావోయిస్టుల ప్రభావమున్న ప్రాంతాల్లో ఈసారి కూడా ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్ బాగానే జరిగినా, మధ్యాహ్నం భానుడి ప్రతాపానికి మందకొడిగా సాగింది. సాయంత్రం మళ్లీ పుంజుకుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగించారు.
మిగతా ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు క్యూలో ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా, పలు నియోజకవర్గాలలో జరిగిన సంఘటనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈవీఎంల మొరాయింపు, ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతు, ఎన్నికల బహిష్కరణ తదితర ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక మంది సామాన్యులతో పాటు పలువురు ప్రముఖ వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో నిరాశతో ఓటు వెయ్యకుండా వెనుదిరిగారు.
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
పది లోక్‌సభ నియోజకవర్గాల్లో అనేకమంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉదయం ఏడు గంటలకే నాగపూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ కుటుంబసమేతంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. విలాస్ ముత్తెంవార్, అంజలి దమానియాలు కూడా నాగపూర్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రఫుల్ పటేల్, దేవేంద్ర ఫడ్నవీస్, నవనీత్ కౌర్, ముఖుల్ వాస్నిక్, ప్రకాష్ అంబేద్కర్ వారివారి నియోజకవర్గాల్లో ఓటును వేశారు.
నాలుగు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ...
వార్ధా సేలు తాలూకాలోని నాలుగు గ్రామాలు ఎన్నికలను బహిష్కరించాయి. అలగావ్, పహెలానపూర్, శివణగావ్, చించోలి గ్రామాల్లో ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. గ్రామంలోని సమస్యలు ప్రతిసారి పరిష్కరిస్తామనే చెప్పి నాయకులు మోసం చేస్తున్నారని ఈ గ్రామస్తులు ఆరోపించారు. అందుకే ఈసారి ఎన్నికలను బహిష్కరించామన్నారు.
అమనావతిలో మధ్యాహ్నం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎమ్మెల్యే అభిజీత్ అడ్సూల్ ఓటర్ల జాబితాలో సుమారు 46 వేల ఓటర్ల పేర్లు లేవని ఆరోపించారు. ఆయన మద్దతుదారులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గోండియాలోని రాంనగర్‌లో ఈవీఎం మొరాయించింది. ఓ యంత్రంలో ఏ బటన్ నొక్కినా నాలుగో నంబర్ బటన్‌పై ఉన్న మంచం గుర్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థికే ఓటు వెళుతుందని అధికారులు గుర్తించారు. మరో ఈవీఎంను ఏర్పాటుచేశారు.
ప్రశాంతంగా ఉప ఎన్నిక...
వాసిం జిల్లాలోని రిసోడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ జనక్ గతేడాది అక్టోబర్ 28వ తేదీన మరణించారు. దీంతో గురువారం జరిగిన ఉప ఎన్నికలో సుమారు 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.
గడ్చిరోలిలో మావోయిస్టుల కాల్పులు
గడ్చిరోలి, న్యూస్‌లైన్: జిల్లాలో ఈవీఎంలు ఎత్తుకెళ్లేందుకు మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఎటాపల్లి తాలూకా గర్దేవాడా సమీపంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈవీఎంలను తీసుకెళుతున్న ఎన్నికల అధికారులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. భద్రతగా ఉన్న పోలీసులు వెంటనే స్పందించడంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే ఎన్ని రౌండ్‌ల కాల్పులు జరిగాయన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అహురి, ఆరమోరి, గోండియా జిల్లాలోని ఆమగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే పోలింగ్ నిర్వహించారు.
నాగపూర్‌లో బ్రిటీషు రాయబారి పర్యటన
నాగపూర్: నాగపూర్‌లో గురువారం జరిగిన ఓటింగ్ సరళిని బ్రిటీష్ రాయబారి సర్ జేమ్స్ డేవిడ్ బెవన్ పరిశీలించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో పొలింగ్ విధానం దగ్గరుండి చూడటం అద్భుతమైన అనుభవమని ఆయన మీడియాకు తెలిపారు. భారత్‌లో మాదిరిగానే బ్రిటన్‌లోనూ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇక్కడి ప్రజాస్వామ్య విధానాన్ని ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకే వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని వివరించారు.
తొలి దశ ప్రశాంతం
Published Thu, Apr 10 2014 10:56 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement