రూ.15 కోట్ల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
Published Sat, Sep 3 2016 7:06 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
బిక్కవోలు: కాపవరం శివారు రైస్‌మిల్లులో జరిగిన విజిలెన్స్ దాడుల్లో సుమారు రూ.15 కోట్ల,73 లక్షల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్టు విజిలెన్స్ ఎస్పీ టి.రాంప్రసాదరావు శనివారం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బి.ప్రత్తిపాడు నుంచి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మినీ వ్యాన్‌ను వెంబడించగా ఆ వ్యాన్ అదే మండలంలోని కాపవరం పంచాయతీ పరిధిలోని శ్రీరాజరాజేశ్వరి రైస్‌మిల్లుకు తరలించినట్టు గుర్తించామన్నారు.
ఈ మేరకు మిల్లు యాజమాన్యాన్ని విచారించగా కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించి ప్రభుత్వానికి సరఫరా చేయవలసిన బియ్యానికి బదులుగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. మిల్లు యాజమాన్యం ఇంకా 12 వందల క్వింటాళ్ళ బియ్యాన్ని సివిల్ సప్లైస్‌కు సరఫరా చేయాల్సి ఉందని విజిలెన్స్ ఎస్పీ రాంప్రసాద్ తెలిపారు. తదుపరి తనిఖీలలో అనపర్తి మండలం దుప్పలపూడిలో వీరికి సంబంధించిన గోడౌన్‌లో, శ్రీధనలక్ష్మీ రైస్‌మిల్లుల్లో వారి సొంత ధాన్యంతోపాటు కస్టమ్ మిల్లింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు.
శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు నిర్వహించిన ఈ దాడుల్లో రూ.15.72 కోట్ల విలువైన ధాన్యం, రేషన్ బియ్యంతోపాటు వాహనాలు, రైస్‌మిల్లు, గోడౌన్లు తదితరు ఆస్తులను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు వ్యాన్ డ్రైవర్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించనున్నట్లు ఎస్పీ రాంప్రసాద్ తెలిపారు.
Advertisement
Advertisement