దయనీయంగా మొణ్ణంగెరి గ్రామం
సాక్షి బెంగళూరు: ప్రకృతి ప్రకోపం ఓ పల్లెను రాళ్లదిబ్బగా మార్చేసింది. పచ్చని పంట పొలాలతో అలరారే ఆ గ్రామాన్ని భీకర వరదలు కబళించాయి. పల్లె సౌభాగ్యాన్ని విషాదాంతం చేసింది. కొండచరియలు విరిగి పడటంతో గ్రామం మొత్తం మట్టి, రాళ్లతో నిండిపోయింది. ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. ఊరంతా ఖాళీ అయి నిర్మానుష్యంగా మారింది. ఒకప్పుడు ఆదర్శంగా వెలుగులీనిన ఆ గ్రామం నేడు మొండిగోడలకు పరిమితమైంది. కొడగు జిల్లాలో చోటు చేసుకున్న వర్ష బీభత్సానికి మొణ్ణంగేరి గ్రామం అద్దం పడుతోంది.
ఎందరో మేధావుల కృషి
కొడగు జిల్లా మొణ్ణంగెరి గ్రామంలో యువకులు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పగలు రాత్రి కష్టపడి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. వారి ప్రయత్నం సుమారు 75 శాతం పూర్తయింది. వచ్చే రెండేళ్లలో మరో 25 శాతం పూర్తి అయ్యే అవకాశం ఉండేది. ఈనేపథ్యంలో వరదలు ఆ గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి. గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా మెరుగైన సదుపాయాలున్నాయి. విద్యుత్, మంచినీరు, సీసీ రోడ్లతో గ్రామం అభివృద్ధి పథంలో పయనించింది. రవాణాసదుపాయాలు మెరుగుపరచడంలో భాగంగా గ్రామ రహదారిలో ఎనిమిది వంతెనలు నిర్మించారు. అయితే వరుణుడి దెబ్బకు అంతా నేలమట్టమైంది. 27 నివాసాలు పూర్తిగా నాశనమయ్యాయి. మరో 167 ఇళ్లు పనికి రాకుండా పోయాయి. ఎనిమిది వంతెనలు కూలిపోయాయి. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. చాలా ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. పలు వాహనాలు మట్టిలో కలిసిపోయాయి.
ఊరందరిదీ ఒకే మాట
భిన్నాభిప్రాయాలు లేకుండా గ్రామస్తులందరూ ఒకేతాటిపై నడిచేవారు.ఈక్రమంలో గ్రామ సర్పంచ్‌గా స్థానికుడు ధనంజయ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండేళ్లలో తమ గ్రామానికి వచ్చే అవకాశం ఉండేదని, ఈక్రమంలో వరదలతో గ్రామం రాళ్లదిబ్బగా మారిందని సర్పంచ్ ధనంజయ్ వాపోయాడు. గ్రామానికి చెందిన చిన్నప్ప (75) మాట్లాడుతూ ఆదర్శ గ్రామం భారీ వర్షానికి సమాధి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్ఛతకు నిదర్శనం
గ్రామంలోని ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. యువకులు ఇంటింటికీ తిరిగి ప్రజలకు అవగాహన కల్పించి మరుగుదొడ్డి నిర్మించుకోవడంలో విజయవంతమయ్యారు. గ్రామంలోని చెత్త చెదారాన్ని ఊరి బయట పడేసేలా చైతన్యం కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని చాలావరకు తగ్గించారు. ఇంటింటా శుద్ధ నీటి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆధునిక, సంప్రదాయ వ్యవసాయం అమలులో ఉండేది. ఇలాంటి గ్రామాన్ని వరుణుడు కనుమరుగు లేకుండా చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment