చంద్రు ఇంటికి ముళ్లకంచె వేసిన గ్రామపెద్దలు ,ప్రేమించి పెళ్లి చేసుకొన్న దంపతులు బిడ్డతోసహా
కర్ణాటక, క్రిష్ణగిరి: రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకొన్నందుకు కులపంచాయతీ చేసిన పెద్దలు రూ.3 లక్షలు జరిమానా విధించడమేగాక చివరకు లక్ష రూపాయలు ఇవ్వవలసిందేనని పట్టుబట్టారు. డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుని తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి తాళాలు వేశారు. ఇంటి చుట్టూ ముళ్లకంపలను అమర్చారు. ఈ సంఘటన సూళగిరి సమీపంలోని జోగిరిపాళ్యంలో జరిగింది. గ్రామానికి చెందిన కదిరవేల్, కవిత దంపతుల కుమారుడు చంద్రు(19) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యువతి దైవాన్(19)ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఏడాదిగా వీరి జాడ ఎవరికీ తెలియలేదు. వీరి కోసం గాలించి వదిలి వేశారు. ఇటీవల వీరికి మగబిడ్డ కలిగింది.
ప్రస్తుతం వీరు తమ గ్రామానికి చేరుకునేందుకు ప్రయత్నించగా గ్రామంలో ఆధిపత్యం చలాయిస్తున్న దైవాన్ సామాజిక వర్గానికి చెందిన కులపెద్దలు దైవాన్ కుటుంబ సభ్యులకు రూ.50 వేలు జరిమానా వేయగా, వారు రూ.25 వేలు చెల్లించారు. అదే విధంగా చంద్రు కుటుంబ సభ్యులకు కూడా రూ.5 లక్షలను జరిమానా విధించారు. చివరకు రూ.3 లక్షలు, ఆపైన రూ.లక్ష జరిమానా విధించారు. డబ్బు కట్టలేక పోవడంతో గ్రామపెద్దలు చంద్రు తల్లిదండ్రులు నివసించే ఇంటికి తాళం వేసి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని గ్రామపెద్దలను అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment