Village expulsion
-
రహత్‌నగర్‌లో దారుణం
నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం రహత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 30 లంబాడీ కుటుంబాలను కులపెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. గత ఆదివారం ఊర పండగ సందర్బంగా గిరిజన కుటుంబాలకు మాంసం పాళ్లు కూడా గ్రామ పెద్దలు పంచలేదు. ప్రశ్నించిన గిరిజనులను గ్రామం వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఆరు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ గ్రామాభివృద్ది కమిటీపై భీంగల్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్‌ను కలిసి గ్రామ పెద్దలపై ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబాలకు ప్రాణభయం ఉందని రక్షణ కూడా కల్పించాలని వేడుకుంటున్నారు. -
కులాంతర వివాహానికి గ్రామ బహిష్కార శిక్ష
కర్ణాటక, క్రిష్ణగిరి: రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమికులు పెళ్లి చేసుకొన్నందుకు కులపంచాయతీ చేసిన పెద్దలు రూ.3 లక్షలు జరిమానా విధించడమేగాక చివరకు లక్ష రూపాయలు ఇవ్వవలసిందేనని పట్టుబట్టారు. డబ్బులు ఇవ్వకపోవడంతో యువకుని తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి తాళాలు వేశారు. ఇంటి చుట్టూ ముళ్లకంపలను అమర్చారు. ఈ సంఘటన సూళగిరి సమీపంలోని జోగిరిపాళ్యంలో జరిగింది. గ్రామానికి చెందిన కదిరవేల్, కవిత దంపతుల కుమారుడు చంద్రు(19) ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యువతి దైవాన్(19)ను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఏడాదిగా వీరి జాడ ఎవరికీ తెలియలేదు. వీరి కోసం గాలించి వదిలి వేశారు. ఇటీవల వీరికి మగబిడ్డ కలిగింది. ప్రస్తుతం వీరు తమ గ్రామానికి చేరుకునేందుకు ప్రయత్నించగా గ్రామంలో ఆధిపత్యం చలాయిస్తున్న దైవాన్ సామాజిక వర్గానికి చెందిన కులపెద్దలు దైవాన్ కుటుంబ సభ్యులకు రూ.50 వేలు జరిమానా వేయగా, వారు రూ.25 వేలు చెల్లించారు. అదే విధంగా చంద్రు కుటుంబ సభ్యులకు కూడా రూ.5 లక్షలను జరిమానా విధించారు. చివరకు రూ.3 లక్షలు, ఆపైన రూ.లక్ష జరిమానా విధించారు. డబ్బు కట్టలేక పోవడంతో గ్రామపెద్దలు చంద్రు తల్లిదండ్రులు నివసించే ఇంటికి తాళం వేసి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని గ్రామపెద్దలను అరెస్ట్ చేశారు. -
ఆ ఊర్లో వింత ఆచారం
మడకశిర: నియోజకవర్గంలో 334 గ్రామాలు ఉండగా.. 50 గ్రామాల్లో యాదవ కుల సామాజిక వర్గీయులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం కరువుకు పుట్టినిల్లు. అయితే రాజకీయ చైతన్యం ఉంది. నియోజకవర్గం ఆంధ్రలో భాగమైనా అధికంగా కర్ణాటక సంస్కృతి కనిపిస్తుంది. 70 శాతం ప్రజలు కన్నడ మాట్లాడతారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్ జిల్లాలోనూ మూఢాచారం పాతుకుపోయింది. మొత్తంగా 90 శాతం కుటుంబాలు ఈ కులాచారాన్ని కొనసాగిస్తున్నాయి. మడకశిరతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎవరూ వీరిలో చైతన్యం తీసుకురాకపోవడం గమనార్హం. హట్టిగొల్ల సామాజిక వర్గంలో మహిళలను ప్రసవానంతరం మూడు నెలల పాటు గ్రామబహిష్కరణ చేస్తారు. పసికూన సహా తల్లిని గ్రామానికి దూరంగా ఉంచుతారు. బాలింతకు కుటుంబ సభ్యులు తొమ్మిది రోజులు మాత్రమే భోజనం అందిస్తారు. ఆ తర్వాత వంట సామగ్రి అందిస్తే.. 51 రోజులు పాటు బాలింత స్వయంపాకం చేసుకోవాల్సిందే. కుండపోత వర్షం కురిసినా, ఎముకలు కొరికే చలిలోనూ వీరి అవస్థలు వర్ణనాతీతం. గొడుగు గుడిసే దిక్కు.. గ్రామ బహిష్కరణ తర్వాత బాలింత నివసించే గుడిసె ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది. విస్తీర్ణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. గుడిసెలో లేవాలన్నా.. నిల్చోవాలన్నా కష్టమే. లోపలికి వెళ్లాలంటే పూర్తిగా వంగి అడుగు వేయాల్సిందే. లోపల ఒక మనిషి ఉండేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. రాజకీయ చైతన్యం సరే.. నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం అధికంగా ఉంది. అయినా మూఢాచారాలు పాటిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రస్తుతం అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇలా ఈ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఉన్నా మూఢాచారాలు రూపుమాపడానికి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ఓ దశలో సామాజిక వర్గానికి చెందిన నేతలే మూఢాచారాలను ప్రోత్సహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పట్టించుకోని స్వచ్ఛంద సంస్థలు.. సమర్థించుకుంటున్న కుల పెద్దలు నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మైరాడా, ఆర్డీటీ, ఫోర్డు తదితర స్వచ్ఛంద సంస్థలు పనిస్తున్నాయి. మైరాడా స్వచ్ఛంద సంస్థకు రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నా.. మూఢాచారాలను రూపుమాపడానికి చొరవ చూపలేకపోయింది. మూఢాచారాన్ని కొందరు కులపెద్దలు సమర్థించుకుంటున్నారు. తమ కులానికి చెందిన వారు కష్టజీవులనేది కులపెద్దల వాదన. ఈ సామాజికవర్గంలోని విద్యావంతుల కుటుంబాలు కులాచారానికి దూరంగా ఉంటున్నాయి. పట్టించుకోని మహిళా శిశు సంక్షేమ శాఖ మూఢాచారాలతో ఎక్కువగా మహిళలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూఢాచారాలను రూపుమాపడానికి మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత వరకు ఎక్కడా ఈ శాఖ అధికారులు కులాచారాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోని పరిస్థితి. ఈ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 438 అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాల్లేవు. బహిష్టు అయినా బహిష్కరణే ! ఈ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బహిష్టు అయినా మూడు రోజుల పాటు నివాసం నుంచి బయటకు పంపుతారు. బాలింతలకు ఉండటానికి కనీసం చిన్న గుడిసె అయినా ఉంటుంది. బహిష్టు అయిన మహిళలకు ఉండటానికి ఎలాంటి సౌకర్యం ఉండదు. మూడు రోజుల పాటు బయటి ప్రదేశంలో ఎండనక, వాననక దుర్భరంగా గడపాల్సిందే. ఈ మహిళలను మూడు రోజుల తర్వాత ఇంటి ఎదుట మరో రెండు రోజులు ఉంచుకుని 5వ రోజు ఇంట్లోకి ఆహ్వానించే మూఢాచారం కొనసాగుతోంది. ప్రతి గొల్లహట్టిలో కూడా ఆ రోజుల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. గ్రామ బహిష్కారానికి గురైన బాలింతలు, బహిష్టు మహిళలను ఈ కమ్యూనిటీ భవనంలో ఉంచాలని వీటిని నిర్మించారు. ఇలాంటి కమ్యూనిటీ భవనాలు నియోజకవర్గంలోని గొల్లహట్టిల్లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. -
ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు బహిష్కరించారు
వేలూరు: ప్రేమ వివాహం చేసుకున్నందుకు గ్రామ బహిష్కరణ చేయడంతో తమ చిన్నారికి పాలు కూడా తీసి ఇవ్వలేక పోతున్నామని ఒక ప్రేమ దంపతులు కలెక్టరేట్‌కు చేరుకొని జిల్లా రెవెన్యూ అధికారి మణివణ్ణన్‌కు వినతి పత్రం అందజేసి కన్నీరు మున్నీరయ్యారు. అరక్కోణం తాలుకా మేలపులం మోటూరు గ్రామానికి చెందిన యువన్య, ఈమె భర్త పార్తిబన్ వేర్వేరు కులాలకు చెందిన వారు అయినప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి యశ్వంత్ అనే ఎనిమిది నెలల కుమారుడున్నారు. ఈ నేపథ్యంలో యువన్య భర్త కుమారుడితో కలిసి కలెక్టరేట్ చేరుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా యువన్య ఇచ్చిన ఫిర్యాదులో తాను తన భర్త వేర్వేరు కులాలకు చెందిన వారు తాము 2014 ఫిబ్రవరి 2వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నాం. వేర్వేరు కులాలు కావడంతో గ్రామ పెద్దలు తమను గ్రామ బహిష్కరణ చేశారు. గ్రామంలో నీరు పట్టేందుకు నిబందన ఉంచారు, గ్రామంలో ఎటువంటి వసతులు పొందలేక తమను బహిష్కరణ చేశారని దీంతో తమ కుమారునికి పాలు కూడా కొనలేక పక్క గ్రామంలోకి వెళ్ళి పాలను తీసుకురావాల్సి ఉందని అధికారులు స్పందించి తమకు అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వినతి పత్రాన్ని స్వీకరించిన డీఆర్వో మణివణ్ణన్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో యువ దంపతులు వెనుతిరిగి వెళ్లారు. -
సర్పంచ్ కుటుంబం గ్రామ బహిష్కరణ
నిజామాబాద్: సర్పంచ్ కుటుంబాన్నే బహిష్కరించిన ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చోటు చేసుకుంది. సర్పంచ్ శోభ కుటుంబాన్ని గ్రామస్థులు బహిష్కరించారు. ఇసుక అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఈ చర్య తీసుకోవడం గమనార్హం. బహిష్కరణతో పాటు సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయల జరిమానా విధించింది గ్రామాభివృద్ధి కమిటీ. సర్పంచ్ కుటుంబాన్ని బహిష్కరించడంపై దళిత సంఘాలు మండిపడ్డారు. చింతలూరు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులపై కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించాయి.