ఆ ఊర్లో వింత ఆచారం | Pregnent Womens Village Expulsion in Madakashira | Sakshi
Sakshi News home page

అమ్మా.. క్షమించు!

Published Sat, Dec 9 2017 6:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

Pregnent Womens Village Expulsion  in Madakashira - Sakshi

మడకశిర: నియోజకవర్గంలో 334 గ్రామాలు ఉండగా.. 50 గ్రామాల్లో యాదవ కుల సామాజిక వర్గీయులు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం కరువుకు పుట్టినిల్లు. అయితే రాజకీయ చైతన్యం ఉంది. నియోజకవర్గం ఆంధ్రలో భాగమైనా అధికంగా కర్ణాటక సంస్కృతి కనిపిస్తుంది. 70 శాతం ప్రజలు కన్నడ మాట్లాడతారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్‌ జిల్లాలోనూ మూఢాచారం పాతుకుపోయింది. మొత్తంగా 90 శాతం కుటుంబాలు ఈ కులాచారాన్ని కొనసాగిస్తున్నాయి.

మడకశిరతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఎవరూ వీరిలో చైతన్యం తీసుకురాకపోవడం గమనార్హం. హట్టిగొల్ల సామాజిక వర్గంలో మహిళలను ప్రసవానంతరం మూడు నెలల పాటు గ్రామబహిష్కరణ చేస్తారు. పసికూన సహా తల్లిని గ్రామానికి దూరంగా ఉంచుతారు. బాలింతకు కుటుంబ సభ్యులు తొమ్మిది రోజులు మాత్రమే భోజనం అందిస్తారు. ఆ తర్వాత వంట సామగ్రి అందిస్తే.. 51 రోజులు పాటు బాలింత స్వయంపాకం చేసుకోవాల్సిందే. కుండపోత వర్షం కురిసినా, ఎముకలు కొరికే చలిలోనూ వీరి అవస్థలు వర్ణనాతీతం.

గొడుగు గుడిసే దిక్కు..
గ్రామ బహిష్కరణ తర్వాత బాలింత నివసించే గుడిసె ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది. విస్తీర్ణం కూడా చాలా చిన్నగా ఉంటుంది. గుడిసెలో లేవాలన్నా.. నిల్చోవాలన్నా కష్టమే. లోపలికి వెళ్లాలంటే పూర్తిగా వంగి అడుగు వేయాల్సిందే. లోపల ఒక మనిషి ఉండేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.

రాజకీయ చైతన్యం సరే..
నియోజకవర్గంలోని యాదవ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం అధికంగా ఉంది. అయినా మూఢాచారాలు పాటిస్తున్నారు. ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందినవారే. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రస్తుతం అసెంబ్లీ బీసీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. ఇలా ఈ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం ఉన్నా మూఢాచారాలు రూపుమాపడానికి ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. ఓ దశలో సామాజిక వర్గానికి చెందిన నేతలే మూఢాచారాలను ప్రోత్సహిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

పట్టించుకోని స్వచ్ఛంద సంస్థలు..
సమర్థించుకుంటున్న కుల పెద్దలు నియోజకవర్గంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మైరాడా, ఆర్డీటీ, ఫోర్డు తదితర స్వచ్ఛంద సంస్థలు పనిస్తున్నాయి. మైరాడా స్వచ్ఛంద సంస్థకు రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్నా.. మూఢాచారాలను రూపుమాపడానికి చొరవ చూపలేకపోయింది. మూఢాచారాన్ని కొందరు కులపెద్దలు సమర్థించుకుంటున్నారు. తమ కులానికి చెందిన వారు కష్టజీవులనేది కులపెద్దల వాదన. ఈ సామాజికవర్గంలోని విద్యావంతుల కుటుంబాలు కులాచారానికి దూరంగా ఉంటున్నాయి.

పట్టించుకోని మహిళా శిశు సంక్షేమ శాఖ
మూఢాచారాలతో ఎక్కువగా మహిళలే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మూఢాచారాలను రూపుమాపడానికి మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంత వరకు ఎక్కడా ఈ శాఖ అధికారులు కులాచారాన్ని రూపుమాపడానికి చర్యలు తీసుకోని పరిస్థితి. ఈ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 438 అంగన్‌వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. అయినా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాల్లేవు.

బహిష్టు అయినా బహిష్కరణే !
ఈ సామాజిక వర్గానికి చెందిన మహిళలు బహిష్టు అయినా మూడు రోజుల పాటు నివాసం నుంచి బయటకు పంపుతారు. బాలింతలకు ఉండటానికి కనీసం చిన్న గుడిసె అయినా ఉంటుంది. బహిష్టు అయిన మహిళలకు ఉండటానికి ఎలాంటి సౌకర్యం ఉండదు. మూడు రోజుల పాటు బయటి ప్రదేశంలో ఎండనక, వాననక దుర్భరంగా గడపాల్సిందే. ఈ మహిళలను మూడు రోజుల తర్వాత ఇంటి ఎదుట మరో రెండు రోజులు ఉంచుకుని 5వ రోజు ఇంట్లోకి ఆహ్వానించే మూఢాచారం కొనసాగుతోంది. ప్రతి గొల్లహట్టిలో కూడా ఆ రోజుల్లో కమ్యూనిటీ భవనాలను నిర్మించారు. గ్రామ బహిష్కారానికి గురైన బాలింతలు, బహిష్టు మహిళలను ఈ కమ్యూనిటీ భవనంలో ఉంచాలని వీటిని నిర్మించారు. ఇలాంటి కమ్యూనిటీ భవనాలు నియోజకవర్గంలోని గొల్లహట్టిల్లో ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement