ప్రేమజంట సౌమ్య, సృజన్ (ఫైల్)
నర్సింగ్ విద్యార్థినితో ప్రేమాయణం
పెళ్లి చేసుకో అన్నందుకు హత్య
శివమొగ్గ జిల్లాలో ఘోరం గుట్టురట్టు
శివమొగ్గ: ప్రేమించినందుకు పెళ్లి చేసుకోమని పట్టుబట్టిన యువతిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడో ప్రియుడు. ఆపై మృతదేహం కూడా ఎవరికీ దొరక్కొద్దని పూడ్చిపెట్టిన ఘటన ఉదంతం కర్ణాటక శివమొగ్గ జిల్లాలో వెలుగు చూసింది.
సాగర తాలూకా తాళగుప్పకు చెందిన సృజన్ (29) అనే యువకుడు తీర్థహళ్లిలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆ కంపెనీలో చిక్కమంగళూరు జిల్లా కొప్పకు చెందిన సౌమ్య (27) అనే యువతి తల్లి రుణం తీసుకుంది. సౌమ్య బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. రుణ కంతులు వసూలు కోసం సృజన్ వారి ఇంటికి వెళ్లేవాడు, ఈ క్రమంలో సౌమ్యతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. ఏమైందో ఏమో కాని ఇటీవల సృజన్ ఉద్యోగం మానేసి స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రేమ చాలు, ఇక పెళ్లి చేసుకోవాలని సృజన్‌ను సౌమ్య ఒత్తిడి చేయసాగింది.
కాలితో గొంతు నులిమి..
ఈ నెల 2న సౌమ్య కొప్ప నుంచి బయలుదేరి సాగరకు వచ్చింది. సృజన్ ఆ యువతిని బైక్‌పై ఎక్కించుకుని కొన్ని చోట్లకు షికారు తిప్పి చివరకు రిప్పన్‌పేట సమీపంలోని హెద్దారిపురకు తీసుకొచ్చి ఊరికి వెళ్లిపో అని చెప్పాడు. అయితే దీనికి యువతి అంగీకరించలేదు. తనను పెళ్లి చేసుకునేవరకూ ఇక్కడి నుంచి వెళ్లనని పట్టుబట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశం పట్టలేక సృజన్ ఆమెను కొట్టడంతో కిందపడిపోయింది, తరువాత మెడపై కాలుతో తొక్కి ఊపిరాడకుండా చేసి చంపాడు. మృతదేహాన్ని అటవీప్రాంతంలో ఉంచి ఇంటికి తిరిగి వచ్చాడు, మళ్లీ కారు తీసుకెళ్లి యువతి మృతదేహాన్ని ఆనందపుర రైల్వే ట్రాక్ సమీపంలోకి తీసుకొచ్చి జలజీవన్ పథకం పనుల కోసం తీసిన కాలువలో పూడ్చిపెట్టి జారుకున్నాడు.
మిస్సింగ్ కేసు..
మరోవైపు యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో అనుమానంతో 3వ తేదీన కొప్ప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పటినుంచి విచారణ చేపట్టారు. యువతి మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను సేకరించి సృజన్‌ను కలిసినట్లు గుర్తించి అతన్ని పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో సృజన్ కథ మొత్తం చెప్పాడు. దీంతో కొప్ప పోలీసులు కేసును సాగరలోని రిప్పన్‌పేట పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. గురువారం తీర్థహళ్లి డీఎస్పీ, నిందితుడు, వైద్యులు కలిసి యువతిని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని తవ్వి మృతదేహాన్ని వెలికితీయించారు. పోస్టుమార్టం నిర్వహించి సౌమ్య మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రేమ కోసం తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment