శశికలే
► తీర్పుతో చిన్నమ్మ సేన కలవరం
► కొత్త నేతగా ఎడపాడి
► ఎమ్మెల్యేల కోసం పన్నీరు ఎదురుచూపు
సాక్షి, చెన్నై : అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబరు 29వ తేదీన బెంగళూరు కోర్టు ఇచ్చిన తీర్పు తమిళనాట అలర్లకు దారి తీశాయి. తమ అమ్మ జయలలితకు జైలు శిక్ష పడడంతో అన్నాడిఎంకే సేనలు వీరంగాన్ని సృష్టించారు. అధికార పక్షం సృష్టించిన ఈ వీరంగం ఓ మచ్చే. ఇక, 2017 ఫిబ్రవరి 14వ తేది ఉదయం పదిన్నర గంటలు సమయం అయ్యే కొద్ది అదే ఉత్కంఠ. మళ్లీ వీరంగాలు బయలు దేరేనా, అన్న ఆందోళన. ఇందుకు కారణం, అమ్మ జయలలిత తదుపరి, ప్రస్తుతం అన్నాడీఎంకే వర్గాల హృదయాల్లో చిన్నమ్మగా ముద్ర పడ్డ శశికళకు వ్యతిరేకంగా అదే కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్నదే. తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించారు. సమయం గడిచే కొద్ది క్షణం..క్షణం ఉత్కంఠ రెట్టింపు అవుతూ వచ్చింది. రాత్రంతా ఎమ్మెల్యేలతో కలిసి కూవత్తూరు క్యాంప్‌లోనే శశికళ ఉండడంతో, ఆ పరిసరాలను మూడు జిల్లాల పోలీసులు తమ భద్రతా వలయంలోకి తెచ్చారు.
తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో అన్నాడీఎంకే శ్రేణులు కూవత్తూరు వైపుగా చొచ్చుకు వస్తే అడ్డుకునేందుకు తగ్గ అస్త్రాలతో ఈసీఆర్ రోడ్డునే తమ గుప్పెట్లోకి బలగాలు తీసుకున్నాయి. పోయెస్‌గార్డెన్, రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం, గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం నివాసం, గోపాలపురంలోని డిఎంకే అధినేత ఎం కరుణానిధి నివాసం, డిఎంకే కార్యాలయాల వద్ద సైతం భద్రతను పెంచారు. మీడియాల్లో తీర్పు ఎలా ఉండబోతుందోనన్న చర్చలు హోరెత్తడంతో సర్వత్రా టీవీలకు అతుక్కు పోయారు. నీరసించిన సేన : సరిగ్గా పదిన్నర గంటలకు సుప్రీం కోర్టులో అక్రమ ఆస్తుల కేసు తీర్పును న్యాయమూర్తులు వెలువరించడంతో ఉత్కంఠ పెరిగింది.
సర్వత్రా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఆమె సేనల్ని నీరసించేలా చేశాయి. వీరంగాలు, అల్లర్లు జరగవచ్చని భావించినా, చివరకు సేనలు అనేక మంది గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదలడం గమనార్హం. సోమవారం అభిమాన కెరటంతో నిండిన పోయేస్ గార్డెన్ కోర్టు తీర్పుతో కళ తప్పింది. అక్కడ ఉన్న కొద్దో గొప్ప చిన్నమ్మ మద్దతు దారులు తీవ్ర ఆవేదనలో మునిగారు.కొందరు అయితే, ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టారు. పన్నీరును తిట్టి పోశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దుమ్మెత్తి పోశారు. ఈ సమయంలో పోయేస్ గార్డెన్‌కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బాణా సంచాల్ని హోరెత్తించడంతో ఉద్రిక్తత బయలు దేరింది.
అక్కడున్న బలగాలు అప్రమత్తం కావడంతో పరిస్థితి అదుపు తప్పలేదు. అక్కడక్కడ చిన్నమ్మమద్దతు దారులు రోడ్డు మీదకూర్చుని తీవ్ర విషాదంలోమునిగారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అదే పరిస్థితి. ఇక్కడ ప్రైవేటు సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసి ఉండటం గమనార్హం. కూవత్తూరు వేదికగా జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఎడ పాడి పళని స్వామిని శాసన సభా పక్ష నేతగా చిన్నమ్మ ఎంపిక చేసిన సమాచారం అన్నాడిఎంకే కార్యాలయంలో కాస్త సందడిని నింపింది.
పన్నీరు శిబిరంలో జోష్ : శశికళకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడంతో పన్నీరు శిబిరంలో ఆనందం తాండవం చేసింది. బాణా సంచాల పేల్చారు. స్వీట్లు పంచి పెట్టారు. ఇక, కూవత్తూరు క్యాంప్‌లో నిర్భందంలో ఉన్న తన మద్దతు ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చేందుకు పన్నీరు దూకుడు ప్రదర్శించారు. పన్నీరు మద్దతు మంత్రి పాండియరాజన్ నేతృత్వంలో ఎంపిలు, ఎమ్మెల్యేలు,మాజీలు కూవత్తూరు వైపుగా దూసుకెళ్లడంతో ఉద్రిక్తత తప్పలేదు.ఎట్టకేలకువారిని కోవళం సమీపంలోనే పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమనిగింది. మాజీల సంఖ్య పెరుగుతున్నా, ఎమ్మెల్యేల సంఖ్య పెరగని దృష్ట్యా, పన్నీరు శిబిరంలో కలవరంతప్పలేదు. మంగళవారం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మద్దతు ప్రకటించడంతో, మిగిలిన వారి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు అడుగులు పెడితే గానీ, తమ సంఖ్య పెరగదన్న ఉత్కంఠ వారిని వీడటం లేదు.
కూవత్తూరులో హై టెన్షన్: రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా, కూవత్తూరులో మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్టు తీర్పు తదుపరి చిన్నమ్మ అరెస్టు కావచ్చన్న సంకేతాలు బయలు దేరాయి. తిరువణ్ణామలై, కాంచీపురం, చెన్నై జిల్లాలకు చెందిన పది వేలమంది పోలీసుల్నిఅక్కడ రంగంలోకి దించారు. ఐజీ వరదరాజన్ నేతృత్వంలో ఇద్దరు ఎస్పీల పర్యవేక్షణలో కూవత్తూరు పరిసరాల్లోని రెండు కీ. మీ దూరంలో ఉన్న ప్రాంతాలు, గోల్డెన్ బే రిసార్ట్‌ను బలగాలు చుట్టుముట్టాయి.
పన్నీరు శిబిరం నుంచి మాజీలు పలువురు రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేను వెంట బెట్టుకు వెళ్లేందుకు రానున్న సమాచారంతో ఆందోళనకర పరిస్థితి ఆపరిసరాల్లో నెలకొంది. వస్తే అడ్డుకుని తీరుతామని చిన్నమ్మ సేనలు హెచ్చరికలు ఇవ్వడంతో ఉత్కంఠ రెట్టింపు అయింది. అలాగే, చిన్నమ్మ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో హాజరు పరచాల్సి ఉండటంతో, ఆమెను అరెస్టు చేస్తారేమో అన్న ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో కూవత్తూరులో 144సెక్షన్ అమల్లోకి తెస్తున్నట్టు కాంచీపురం జిల్లా యంత్రాంగం ప్రకటించినట్టు వచ్చిన సంకేతాలతో టెన్షన్...వాతావరణం తప్పలేదు.