పరమేశ్వర్ ఆశలపై నీళ్లు | Water on hopes Parameswar | Sakshi
Sakshi News home page

పరమేశ్వర్ ఆశలపై నీళ్లు

Published Sun, Feb 22 2015 1:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Water on hopes Parameswar

‘దళిత సీఎం’కు ఇది సమయం కాదన్న డిగ్గీరాజా
ముఖ్యమంత్రికి కావాల్సిన అన్ని అర్హతలున్నాయన్న కేపీసీసీ చీఫ్

 
బెంగళూరు: దళిత ముఖ్యమంత్రి డిమాండ్‌ను లేవనెత్తడం ద్వారా ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావించిన కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ఆశలపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ నీళ్లు చల్లారు. దళిత నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పేముందంటూ పరమేశ్వర్ శనివారమిక్కడ వ్యాఖ్యలు చేసిన వెంటనే, దళిత సీఎం అంశంపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శనివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ మాట్లాడుతూ....‘ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి కావాల్సిన అన్ని అర్హతలు నాకున్నాయి. అందువల్ల అవకాశం వచ్చినపుడు తప్పకుండా ఆ స్థానాన్ని చేపడతాను’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను ముఖ్యమంత్రి పదవి కాంక్షితుల్లో ఒకడినని, అయితే ఎన్నికల్లో ప్రజలు తనను తిరస్కరించారని అన్నారు. అంతమాత్రాన తనకు ముఖ్యమంత్రినయ్యే అర్హత లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇక కొన్ని దళిత సంఘాలు చేస్తున్న దళిత సీఎం డిమాండ్‌లో తప్పేమీ లేదని, వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వాతంత్య్రం వారికి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి పదవి కోసం తనే దళిత సంఘాల నేతలతో ‘దళిత సీఎం’ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాననడంలో ఎంతమాత్రం నిజం లేదని పరమేశ్వర్ వెల్లడించారు.

కాగా, పరమేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పరమేశ్వర్ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. శనివారమిక్కడ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ...‘దళిత సీఎం అంశంపై చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం వినిపిస్తున్న దళిత సీఎం విషయంపై ఇప్పుడు నేనేమీ మాట్లాడలేను. అసలు దళిత సీఎం విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ప్రస్తుతం లేదు’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యల ద్వారా సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనుకున్న పరమేశ్వర్‌కు దిగ్విజయ్ సింగ్ తాత్కాలికంగా బ్రేక్ వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement