ఒడిశా, భువనేశ్వర్: రాష్ట్రానికి వర్ష సూచన జారీ అయింది. ఈ నెల 5వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే హెచ్చరికను వాతావరణ సమాచార వర్గాలు జారీ చేశాయి. అకాల వర్షాలతో పొలాల్లో పంటలు దెబ్బ తినకండా జాగ్రత్త వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయం ముందస్తు ఆదేశాలు జారీ చేసింది. నువాపడా, బర్‌గడ్, ఝార్సుగుడ, సుందర్‌గడ్, సంబల్‌పూర్, దేవ్‌గడ్, కెంజొహార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాల సంకేతం జారీ అయింది.
తదుపరి దశలో సుందర్‌గడ్, దేవ్‌గడ్, అనుగుల్, సోన్‌పూర్, బౌధ్, కెంజొహార్, ఖుర్దా, మయూర్‌భంజ్ జిల్లాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశముందంటూ పసుపు పచ్చని హెచ్చరిక జారీ చేశారు. మయూర్‌భంజ్, కెంజొహార్, సుందర్‌గడ్, అనుగుల్, ఢెంకనాల్, నయాగడ్, కొందమాల్, గజపతి జిల్లాల్లో ఈ నెల 3, 4వ తేదీల్లో వర్షాలకు అనుకూల వాతావరణం అలుముకుంటుంది. భద్రక్, బాలాసోర్, ఖుర్దా, కటక్, మయూర్‌భంజ్, గంజాం, గజపతి, మల్కన్‌గిరి, రాయగడ, కలహండి, నవరంగపూర్ జిల్లాల్లో ఈ నెల 5వ తేదీన వర్షాలు ప్రభావంచూపుతాయి.
ఈ ప్రాంతాల్లో పొలాల్లో పంటకు తక్షణమే రక్షణ కల్పించాలని ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్త కుమార్ జెనా ముందస్తు జాగ్రత్త సూచించారు. వర్షంలో పంట తడిసి ముద్దయి నష్టపోకుండా ముందుగానే పంటల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తడవకుండా కప్పి ఉంచే రీతిలో రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు ఈ పనుల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment