సాక్షి, జయపురం(భువనేశ్వర్): వర్షం కురవాలని కప్పకు పెళ్లి చేసిన అరుదైన సంఘటన నవరంగపూర్ జిల్లాలోని ఉమ్మర్‌కోట్ సమితి, కొరమరి గ్రామంలో ఆదివారం తారసపడింది. సాధారణంగా జరిగే వివాహం తరహాలోనే మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ కప్ప పెళ్లి అత్యంత వైభవంగా జరిపారు. కార్యక్రమం అనంతరం గ్రామస్తులంతా తమ సంప్రదాయ నృత్య ప్రదర్శనలు చేపట్టి, ఆకట్టుకున్నారు.
వివరాలిలా ఉన్నాయి.. ఈ గ్రామ ఆదివాసీలంతా వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా బతుకుతారు. అనాది కాలంగా ఏటా ఖరీఫ్ సీజన్‌లో ఇలా వర్షాల కోసం కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. ప్రధానంగా శ్రావణమాసంలో వరుణ దేవుడిని మెప్పించి, వర్షం పొందేందుకు ఇలా కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే మనుషుల పెళ్లిలో ఉండే తంతు అంతా ఈ కప్పల పెళ్లిలో కూడా కనిపిస్తుంటుంది.
తొలుత తమ వ్యవసాయ దేవతలైన బీమ, బీమానిలకు నవదిన పూజలు చేస్తారు. ఆ తర్వాత పెళ్లికి కప్పల కోసం గాలిస్తారు. ఈ క్రమంలో రెండు, మగ మరో రెండు ఆడ కప్పలను మండపానికి తీసుకువచ్చి, పెద్దల సమక్షంలో సంప్రదాయ రీతిలో వాటికి పెళ్లి చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. ఈ సంప్రదాయం తరతరాల నుంచి కొనసాగుతూ వస్తోందని గ్రామస్తుడు రామనాథ్ పూజారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment