ఐ యామ్ హ్యాపీ
మొదట సందిగ్ధంలో పడ్డా, ఇప్పుడు నేను హ్యాపీ అంటోంది నటి ధన్సిక. ఇంతకు ఈమె ఏ విషయం గురించి మాట్లాడుతుందనేగా మీ ప్రశ్న. పేరాన్మై చిత్రంతో నటిగా తానేమిటో నిరూపించుకున్న ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం తిరుందిడుసిసే సుధాస్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నవ నటులు వీరవన్ స్టాలిన్, నారాయణ్, అంజెనా కీర్తి ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు శంకర్ శిష్యుడు నిమేష్ వర్షన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటి ధన్సిక తెలుపుతూ తిరుందిడు సిసే యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రం అని పేర్కొంది. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పింది. అయితే మొదట చిత్రం చేద్దామా? వద్దా అన్న సందిగ్ధంలో పడ్డానని అంది.
కారణం ఇందులోని పాత్రకు న్యాయం చేయగలనా? అన్న సందేహమేనని పేర్కొంది. అయితే ఇప్పుడు చాలా హ్యాపీ అని అంది. ఈ చిత్రంలో చార్మి అనే పాత్రలో నటించానని తెలిపింది. ఇది అత్యాచారానికి గురైన యువతి పాత్ర అని చెప్పింది. ఈ పాత్రలో తన నటనకు పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని చెప్పింది. తనది చాలా బ్యాలెన్సింగా నటించాల్సిన పాత్ర అని ఏ మాత్రం అటూ ఇటూ అయినా దాన్ని స్వభావం మారిపోతుందని అంది. ఇది సమాజంపై చెడు ప్రభావం చూపే అంశాలపై కనువిప్పు కలిగించే కథాచిత్రం అని ముఖ్యంగా మద్యానికి బానిసలైన వ్యక్తులు అత్యాచారాలు లాంటి అంశాలను చర్చించే చిత్రం అని పేర్కొంది. సమాజానికి చక్కని సందేశాన్నిచ్చే ఇలాంటి చిత్ర యూనిట్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని నటి ధన్సిక అంది.